తిరుమల శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే శుభార్త. ఇప్పటి వారకు స్వామి వారిని దర్శించుకోవాలంటే.. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. 

దివ్య, సర్వదర్శన స్లాటెడ్‌ టోకెన్ల భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి ఉద్యానవనంలో రూ.25 కోట్ల వ్యయంతో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తికానుంది. సెప్టెంబరు నెలాఖరులో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల సమయానికి వీటిని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

స్లాటెడ్‌ టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన స్లాట్‌తో నిమిత్తం లేకుండా కాస్త ముందుగా శ్రీవారి దర్శనం ముగించుకోవాలనే ఆలోచనతో నారాయణగిరి ఉద్యానవనాల వద్ద ముందుగా గుమికూడుతున్నారు. ఇలాంటి వారిని క్యూలైన్‌ ప్రవేశం వద్ద సిబ్బంది అడ్డుకుని టోకెన్‌పై ఉన్న సమయానికి గంట ముందుగా రావాలని తిప్పి పంపాల్సి వస్తోంది. 

అయినా భక్తులు తిరిగివెళ్లక గంటలకొద్ది రోడ్లపై, చెట్లకింద గడుపుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కో రోజు ఆ ప్రాంతంలో రద్దీ పెరిగి తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ భవనాలు పూర్తైతే.. క్యూలైన్ లలో నిలబడే బదులు ఆ గదుల్లో విశ్రాంతి తీసుకొని తర్వాత స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.