హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా గోదావరి,కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన నుండి వస్తున్న వరదతో ధవళేశ్వరం నుండి 13.75 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా నదికి కూడ ఎగువ నుండి భారీగా నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2లక్షలకు పైగా నీరు వచ్చి చేరుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది., గోదావరితో పాటు ఇంద్రావతి, శబరి నదులకు కూడ వరద పోటెత్తింది. 

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.  ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 13.75 మేర అడుగుల నీరుంది. సుమారు 13.75 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. అయితే ఇంద్రావది, శబరి నదులకు వరద పోటెత్తింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది.

గోదావరి నదిలో వరద పోటెత్తిన కారణంగా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు నీట మునిగాయి. సుమారు 5 వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించారు. పోలవరం ముంపు గ్రామాల్లో గోదావరి నీరు చేరింది.  పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం పెరుగుతుంది. స్పిల్ వే వరద నీటిలోకి మునిగింది.

పోలవరం వైపు ఎనిమిది గ్రామాలు, దేవీపట్నం పరిధిలోని  ఏడు గ్రామాలు పూర్తిగా మునిగాయి. దేవీపట్నంలో 33 గ్రామాలు, పోలవరం వైపు 19 గ్రామాల్లో రోడ్ల మీదకు నీరు చేరింది. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. 

మరో వైపు కృష్ణా నదికి కూడ వరద పోటెత్తింది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుండి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుమారు 2 లక్షలకు పైగా క్యూసెక్కు నీరు దిగువకు విడుదల అవుతోంది. శ్రీశైలం నుండి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.