జగ్గయ్యపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి. జాతీయ భావాలతోనే ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ పెట్టినట్లు స్పష్టం చేశారు. శ్రమలేకుండా రాజకీయ పార్టీలు పెట్టి నేడు అధికారంలోకి వచ్చారంటూ వైసీపీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. 

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గాంధీ సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టారు సుజనాచౌదరి. బీజేపీతో తెగదెంపులపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు రియలైజ్ కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు సుజనాచౌదరి. 

చంద్రబాబు నాయుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని చెప్పుకొచ్చారు ఎంపీ సుజనాచౌదరి. 

ఇకపోతే వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారం ఉందని రాష్ట్రప్రభుత్వం రాజులా వ్యవహరిస్తే కుదరదని విమర్శించారు. 60ఏళ్లు నకిలీ గాంధీలు దేశాన్ని పాలించడం వల్ల దేశం ఎంతో నష్టపోయిందని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాల వల్లనే ప్రాంతీయ వాదం పెరిగిపోయిందని విమర్శించారు. అవినీతి సొమ్ముతోనే పార్టీల నిర్మాణం జరిగిందన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చారని సుజానా చౌదరి విమర్శించారు. 

ప్రాంతీయ పార్టీలు రాజకీయం కోసమే పాకులాడతాయని విమర్శించారు ఎంపీ సుజనా చౌదరి. ప్రజాప్రయోజనాల కోసం నిలబడేది జాతీయ పార్టీలేనని తెలిపారు. బీజేపీ జాతీయ పార్టీ అని ప్రజలంతా బీజేపీతోనే నడవాలని కోరారు. 

పేద వర్గాలకు నీడ, ఉపాధి భరోసా కల్పిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని సుజనా తెలిపారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి, గత ఐదున్నరేళ్లలో జరిగిందని దేశం మొత్తం చెప్తోందని తెలిపారు. జాతీయవాదాన్ని, దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీని బలపరచాలని సుజనాచౌదరి ప్రజలను కోరారు.