విజయవాడ రైల్వే స్టేషన్‌‌లో బాలిక కిడ్నాప్‌.. రంగంలోకి ప్రత్యేక బృందాలు, సీసీ ఫుటేజ్‌లో నిందితురాలి జాడ

విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఓ చిన్నారి కిడ్నాప్‌కు గురైన వ్యవహారం కలకలం రేపుతోంది. దీంతో పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. 

girl child kidnapped at vijayawada railway station

విజయవాడ రైల్వేస్టేషన్‌లో (vijayawada railway station) మూడేళ్ల బాలిక కిడ్నాప్‌నకు (kidnap) గురైన వ్యవహారం కలకలం రేపుతోంది. కిడ్నాప్‌నకు గురైన బాలికను షేక్‌ షఫీదాగా, తల్లిదండ్రులు రైల్వే స్టేషన్‌లో చిత్తుకాగితాలు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఏరుకుని జీవనం సాగిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వివరాల్లోకి వెళితే.. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఆడుకుంటున్న చిన్నారి వద్దకు గుర్తుతెలియని మహిళ వచ్చింది. పాపకు చాక్లెట్లు ఇప్పించి అనంతరం బాలికను అపహరించుకుపోయింది. ఆ సమయంలో చిన్నారి తల్లి నిద్రిపోతుండగా.. తండ్రి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే పాప కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన తల్లి వెంటనే రైల్వే స్టేషన్‌లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అనంతరం పాపను ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించేందుకు రైల్వే స్టేషన్‌ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. షఫీదాను రైల్వేస్టేషన్ బయటకు తీసుకువచ్చి ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం నెహ్రూ బొమ్మ సెంటర్ ఏరియాలో కొండపైకి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో చిట్టినగర్, పంజా సెంటర్, వాగు సెంటర్, డెయిరీ ఫ్యాక్టరీ సితార సెంటర్ తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీని నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు పంపించి ఆరా తీస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios