పక్కింట్లోని కుక్కపిల్లలను చూడడానికి వెడితే.. దొంగతనానికి వచ్చావంటూ కొట్టేసరికి మనస్తాపం చెందిన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.  

ఏలూరు : ఏలూరు నగరానికి చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకోగా.. దొంగతనానికి వచ్చావంటూ పక్కింటి వారు కొట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కర్నాటి కోమలేశ్వరి (17) ఏలూరులోనే ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. తండ్రి గతంలోనే మృతి చెందటంతో తల్లి పద్మావతే కుటుంబాన్ని పోషిస్తోంది. గత నెల 25న పక్కింట్లో కుక్క పిల్లలను చూసేందుకు కోమల్లేశ్వరి వెళ్ళింది. అయితే ఆ ఇంట్లోని భార్య భర్తలు ఆమెను.. దొంగతనం చేసేందుకు వచ్చావా? అంటూ కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అదేరోజు ఆమె పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంటున్న నాన్నమ్మ వెంకటరమణ ఇంటికి వెళ్ళింది. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీన రాత్రి ఆమె మృతిచెందింది. దీనిపై ఏలూరు త్రీ టౌన్ సిఐ ప్రసాదరావు మాట్లాడుతూ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దేనికి గర్జనలు?.. జగన్ సర్కార్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. వరుస ట్వీట్స్‌తో ప్రశ్నల వర్షం..

ఇదిలా ఉండగా, బెంగళూరులో ఓ యువతి ఇలాగే ఆత్మహత్య చేసుకున్న ఘటన సెప్టెంబర్ లో చోటు చేసుకుంది. బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ అమ్మాయికి తాను.. తన భర్తకు రెండో భార్య అని తెలియడంతో తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. గౌతమి అనే 24 ఏళ్ల నవ వధువు మారతహళ్లిలోని కావేరీ లేఅవుట్‌లో తన అద్దె ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారుజామున 4 గంటల మధ్య ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

భర్త రెడ్డి ప్రసాద్ ఉదయం లేచి చూసేసరికి భార్య మృతదేహం కనిపించింది. గౌతమి తండ్రి ఎ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారతహళ్లి పోలీసులు ప్రసాద్‌, అతని మొదటి భార్య ఆయుషా బానుపై కేసు నమోదు చేశారు. గౌతమి బికామ్‌ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోందని బాబు పోలీసులకు తెలిపాడు. తమ పక్క గ్రామం దిన్నిపల్లికి చెందిన ప్రసాద్‌తో ప్రేమలో పడి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పెళ్లి చేసుకుందని సమాచారం.

వీరిద్దరూ మార్చి 19, 2022న వివాహం చేసుకున్నారు. కూతురు కనిపించకపోవడంతో గౌతమి తండ్రి బాబు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశాడు. ఆ తరువాత ఆమె పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యింది. తాను ఇష్టపూర్వకంగానే ఇంట్లోంచి వెళ్లిపోయానని.. తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నానని తెలియజేసింది. ఆ తర్వాత దంపతులు బెంగళూరుకు మకాం మార్చారు.

ప్రసాద్‌కి అంతకు ముందే పెళ్లయిందని.. బాను అనే భార్య, ఒక కూతురు ఉందని గౌతమికి తెలిసిందని బాబు ఆరోపించారు. ఆ రోజు మొదటి భార్య బాను ఇంటికి వచ్చిందని గౌతమి బాబుకు ఫోన్ చేసి చెప్పింది. ఇదివరకే పెళ్లి అయినా తననెందుకు మోసం చేశావని ఆమె ప్రశ్నించగా.. ప్రసాద్, బాను ఇద్దరూ ఆమెను ఇష్టానుసారం తిట్టారని, వేదించారని తెలిపిందని చెప్పుకొచ్చాడు.