వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. అయితే శనివారం విడుదలైన వ్యూహం టీజర్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన కామెంట్స్ చేశారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను వర్మ శనివారం విడుదల చేశారు. అయితే వ్యూహం టీజర్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన కామెంట్స్ చేశారు. వ్యూహం సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపించే ప్రయత్నం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సోనియాను చెడుగా చూపెడితే వర్మని బట్టలూడదీసి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. అసలు వాస్తవాలు వర్మకి తెలుసా? అని గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు.
దివంగత సీఎం వైఎస్సార్ కూతురు, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు , సిద్దాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చిన స్వాగతిస్తామని స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ మహానాయకుడని చెప్పారు. గాంధీ భవన్‌లో సీఎల్పీ సమావేశం జరిగినప్పుడు.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనేది ఆయన చివరి కోరిక అని రాజశేఖరరెడ్డి చెప్పారని అన్నారు. తాము ఆ కోరిక కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామని.. ఆ కోరికలో భాగస్వామురాలిగా షర్మిల కూడా వచ్చి పనిచేస్తే తప్పకుండా స్వాగతిస్తామని అన్నారు.
ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అభిమానంతోని వ్యూహం సినిమా తీస్తున్నానని ఆర్జీవీ ఇది వరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం జగన్‌తో కూడా ఆర్జీవీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గతంలో వైసీపీకి మద్దతుగా కొన్ని చిత్రాలను తెరకెక్కించడంలో కీలక పాత్ర వహించిన ఆర్జీవీ.. ఇప్పుడు జగన్‌ను హీరోగా చూపించే కథనంతో వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
టీజర్ విషయానికి వస్తే.. హెలీకాఫ్టర్ ప్రమాదంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఈ టీజర్ మొదలైంది. ఆ తరవాత.. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన పరిణామాలు, ప్రతిపక్షాలు వ్యుహాలు పన్నాయని, జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడం వంటి అంశాలతో.. టీజర్ ముందుకు సాగింది. సీబీఐ డౌన్ డౌన్ అంటూ చేసే నినాదాలను కూడా చూపించారు. చివరిలో అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు అంటూ జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ చెప్పడం టీజర్‌లో కనిపించింది. అయితే ఈ చిత్రంలో ఎవరి పాత్రను విలన్‌గా చూపించబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
