ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21తో ముగియనుంది. ఈ క్రమంలోనే ఆ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం ఆ నాలుగు స్థానాలను కూడా అధికార వైసీపీ సొంతం చేసుకోనుంది. అయితే ఈ నాలుగు స్థానాలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎవరికి కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
త్వరలో దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21తో ముగియనుంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న వారిలో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు, సురేష్ ప్రభులు ఉన్నారు. వీరిలో విజయసాయి రెడ్డి వైసీపీది కాగా.. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు టీడీపీ నుంచి గెలుపొంది ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక, బీజేపీ నేత సురేష్ ప్రభు అప్పటి టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం ఆ నాలుగు స్థానాలను కూడా అధికార వైసీపీ సొంతం చేసుకోనుంది. అయితే ఈ నాలుగు స్థానాలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎవరికి కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కోరి మేరకు రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా సీఎం జగన్ వైసీపీ తరఫున ఓ పారిశ్రామికవేత్తకు అవకాశం కల్పించనున్నారు. అమిత్ షా ప్రతిపాదన మేరకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదీనీ కుటుంబంలో ఒకరికి సీఎం జగన్ వైసీపీ తరఫున రాజ్యసభ బరిలో నిలుపుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన సమావేశంలో అదానీకి వైసీపీ రాజ్యసభ టికెట్ ఇచ్చే విషయంపై అమిత్ షా చర్చించగా.. అందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
ఈ క్రమంలోనే వైసీపీ తరఫున గౌతమ్ అదానీ లేదా ఆయన భార్య ప్రీతి అదానీ.. వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ పొందడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి తిరిగి మరోసారి రాజ్యసభలో కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని సమాచారం.
ఇక, మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇందుకు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు పేరును సీఎం జగన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. నాలుగో స్థానాన్ని సీఎం జగన్ తన తరఫున కేసులు వాదిస్తున్న న్యాయవాది నిరంజన్‌రెడ్డికి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. నిరంజన్‌రెడ్డి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోతే ఉత్తరాంధ్రకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. కిల్లి కృపారాణి ఉత్తరాంధ్రలో కళిగం సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు చోటు దక్కించుకుంటారో వేచిచూడాల్సిన అవసరం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, చివరి నిమిషంలో సామాజిక సమీకరణాల లెక్కలు మారితే.. 2024 ఎన్నికల దృష్టిలో ఉంచుకుని నాలుగో స్థానానికి అభ్యర్థి ఎంపికలో మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు మారితే నాలుగో రాజ్యసభ స్థానాన్ని.. మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థికి లేదా ఎస్సీ ప్రతినిధికి దక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. సీఎం జగన్ ఇప్పటికే ముగ్గురి పేర్లను ఖరారు చేశారని.. రెండు మూడు రోజుల్లో నాలుగో అభ్యర్థిని ఖరారు చేస్తారని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
అలీకి చోటు లేనట్టేనా..!
ప్రముఖ సినీ నటుడు అలీని సీఎం జగన్ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతుంది. సీఎం జగన్ గుడ్ న్యూస్ చెబుతానని అలీతో అన్నారు. ఈ నేపథ్యంలోనే మైనారిటీ కోటాలో ఆయనను రాజ్యసభకు పంపనున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుత పరిణామాలు గమనిస్తే అలీకి.. ప్రస్తుతానికి రాజ్యసభ సీటు దక్కకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.
ఇక, 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న గణంకాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీకి 150 సీట్లు ఉండగా, ప్రతిపక్ష టీడీపీకి 23, జనసేనకు ఒక సీట్లు ఉన్నాయి. ఫిబ్రవరిలో మంత్రి మేకపాటి గౌతమ్ మృతి చెందడంతో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం ఖాళీ అయింది. అయితే టీడీపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే.. వైసీపీలో అధికారికంగా చేరకపోన ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అయితే ఒక్కో రాజ్యసభ సీటును గెలవాలంటే సగటున 44 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.. దీంతో మొత్తం నాలుగు స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక, ఏపీకి రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి ప్రస్తుతం ఆరుగురు సభ్యులు ఉన్నారు. అందులో విజయసాయిరెడ్డి పదవీకాలం ముగియనుండటంతో ఆ సంఖ్య ఐదుకు చేరుతుంది. ప్రస్తతుం షెడ్యూల్ విడుదలైన నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఎగువ సభలో ఆ పార్టీ బలం 9కి చేరనుంది.
ఇక, వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర, బీజేపీకి చెందిన సీఎం రమేష్‌ల రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ముగియనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత బలాల దృష్ట్యా ఆ మూడు స్థానాలను కూడా వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
