చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు . తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని శ్రీనివాసరావు హెచ్చరించారు. పొత్తుల కారణంగా టికెట్ దక్కనివారికి పార్టీ న్యాయం చేస్తుందని గంటా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను శనివారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో స్థానం దక్కని నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలకు బుజ్జగింపులు చేపట్టారు చంద్రబాబు . తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ అధినేతను కలిశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని శ్రీనివాసరావు హెచ్చరించారు.
టీడీపీ జనసేన తొలి జాబితాలో పేరు లేకుంటే సీనియర్లను అవమానించినట్లు కాదని, పొత్తుల కారణంగా టికెట్ దక్కనివారికి పార్టీ న్యాయం చేస్తుందని గంటా తెలిపారు. చీపురుపల్లి నుంచి ఈసారి బరిలో దిగాలని చంద్రబాబు తనకు సూచించారని.. అయితే తాను భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పినట్లు శ్రీనివాసరావు వివరించారు. టీడీపీ తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని.. ప్రజల నుంచి కూడా స్పందన బాగుందని ఆయన వెల్లడించారు. 70 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించడానికి వైసీపీ 7 జాబితాలు విడుదల చేసిందంటూ గంటా చురకలంటించారు.
కాగా.. గుంటూరు జిల్లాలోని కీలక స్థానాల్లో ఒకటైన తెనాలి పొత్తులో భాగంగా జనసేన కోరడంతో ఈ సెగ్మెంట్‌ను తెలుగుదేశం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు ఖరారైనప్పుడే తెనాలి సీటు విషయంలో సర్వత్రా చర్చ జరిగింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటును పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అడుగుతారని భావించారు.
అనుకున్నట్లుగానే తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల అభ్యర్ధిత్వం ఖరారైంది. మరి ఆలపాటి పరిస్ధితి ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసానికి ఆలపాటిని పిలిపించిన చంద్రబాబు బుజ్జగించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
