గంటా శ్రీనివాసరావు - ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈయనొక హాట్ టాపిక్. టీడీపీకి అంటీముట్టనట్టుగా ఉంటూ వైసీపీలో చేరడమే తరువాయి అంటూ అనేక వార్తలు వచ్చాయి వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆయన వైసీపీలో చేరే మూర్తం ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. 

కానీ ఇంతవరకు గంటా మాత్రం వైసీపీలో చేరింది లేదు. ఇదిలా ఉండగా నేటి ఉదయం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. 

గంటా పార్టీ మారతాడు అన్న వదంతులు వస్తుండడంతో.... పవన్ అభిమానులు జనసేనలోకి రమ్మని ఆ ట్వీట్ కింద కోరుతుండగా, మరికొంతమంది బీజేపీలోకి రావాలని కోరుతుండడం విశేషం. 

గంటా ఇలా ట్వీట్ చేయడం వెనుక ఏదో రాజకీయ కోణం దాగి ఉందని అనుకోకండి. గంటా ఇలానే సినిమా హీరోల బర్త్ డే లకు విష్ చేస్తూనే ఉంటారు. మొన్న చిరంజీవి, నాగార్జున బర్త్ డేలకు కూడా శుభాకాంక్షలు తెలిపాడు. 

దానికి తోడు గంటా శ్రీనివాసరావు చిరంజీవి పిఆర్పీ  నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఆతరువాత పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసారు. 

ఈ కారణాల వల్ల గంటాకు పవన్ తో సాన్నిహిత్యం ఎక్కువ. ఈ పరిచయంతోనే పవన్ కళ్యాణ్ కి వేదికగా శుభాకాంక్షలు తెలిపారు గంటా శ్రీనివాసరావు. పవన్ అభిమానులు మాత్రం ట్విట్టర్ వేదికగా పార్టీలోకి ఆహ్వానాలను పంపుతూనే ఉన్నారు. 

గంటా ఇంకా వైసీపీలో చేరలేదు. టీడీపీని వీడేందుకు ఆలోచనలు చేస్తున్నారు. వ్యాపారాల దృష్ట్యా గంటా వైసీపీ నేతల ధాటికి తట్టుకోలేకపోతుంటే... బీజేపీ కూడా గంటకు అండగా నిలవగలదు. జనసేన బీజేపీ మిత్రపక్షం కాబట్టి గంటా జనసేనలోకి వస్తే తప్పేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

అందునా గంటా చిరంజీవితో కలిసి రాజకీయ ప్రయాణం చేసారు. సామాజికసమీకరణం కూడా కలవడం, గతంలో కూడా గంటా బీజేపీలో చేరతారు అనే వార్తలు రావడం, అన్ని వెరసి గంటా పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు చూడకూడదు అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు ఫాన్స్