Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవితో భేటీ కానున్న గంటా శ్రీనివాసరావు.. పార్టీ మార్పుపై క్లారిటీ!.. ఇంతకీ ఆయన దారెటు..?

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని ఇప్పటికే పలుమార్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఆయన పార్టీ మార్పు అంశంపై విస్తృతమైన చర్చ సాగుతుంది.
 

Ganta Srinivasa Rao To Meet Chiranjeevi likely to discuss on party change
Author
First Published Nov 26, 2022, 11:43 AM IST

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని ఇప్పటికే పలుమార్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. ఆ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.. అధిష్టానం, పార్టీ నేతలతో గ్యాప్ మెయింటెన్ చేస్తున్నారు. ఆయన అధికార వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆ దిశగా మాత్రం గంటా అడుగులు వేయలేదు. మరోవైపు ఒకటి, రెండు సందర్భాల్లో చంద్రబాబును కలిసి గంటా శ్రీనివాసరావు.. పార్టీలో ఉన్నాననే సంకేతాలు పంపారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లోనైతే గంటా శ్రీనివాస్ పాల్గొనలేదు. పార్టీ లైన్‌కు మద్దతుగా కూడా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. 

అయితే ఈ పరిణామాల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు తన సన్నిహితులతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా  మారింది. ఆయన టీడీపీని వీడేందుకు సిద్దమయ్యారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని కలవనున్న గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు అంశంపై ఆయనతో చర్చించనున్నారు. చిరంజీవి కుటుంబంతో గంటా శ్రీనివాసరావుకు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. 

సన్నిహితులతో సంప్రదింపుల అనంతరం డిసెంబర్ 1వ తేదీన తన జన్మదినం తర్వాత పార్టీ మార్పుపై గంటా శ్రీనివాసరావు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయమైందని విశాఖలో ప్రచారం సాగుతుంది. డిసెంబర్‌లోనే అది జరగనుందని అంటున్నారు. 

అయితే పార్టీ మార్పుపై చిరంజీవితో గంటా శ్రీనివాసరావు భేటీ కావడంతో మరో చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి పలు కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు గంటా శ్రీనివాసరావు జనసేనను విమర్శిస్తూ ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేదు. మరి జనసేనలో చేరిక దిశగా చిరంజీవి వద్ద గంటా శ్రీనివాసరావు ఏమైనా చర్చిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios