తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు.. చాలా కాలం తర్వాత చంద్రబాబు నివాసానికి వచ్చారు. 

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు.. చాలా కాలం తర్వాత చంద్రబాబు నివాసానికి వచ్చారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌లతో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కనిపించారు.అనంతరం చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించారు.

ఇక, గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం ఆయన అధికార వైసీపీలో చేరాతరనే సంకేతాలు కనిపించాయి. కొందరు స్థానిక నాయకులు అడ్డుపడటంతో గంటా వైసీపీలో చేరలేకపోయారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత గంటా సైలెంట్ అయిపోయారు. తన పని తాను చేసుకుంటూ ఉండిపోయారు. అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ లేఖను స్పీకర్‌కు పంపారు. 
 ప్రస్తుతం అది స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది.

అయితే కొన్ని వారాల క్రితం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా గంటా శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. కానీ చంద్రబాబు పర్యటనలో మాత్రం పాల్గొనలేదు. అలాగే జిల్లాలో గానీ, పార్టీ కేంద్ర కార్యాలయంలోని గానీ.. ఎటువంటి కార్యక్రమాలకు కూడా గంటా శ్రీనివాసరావు హాజరైన సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి గంటా శ్రీనివాసరావు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి రావడం చర్చనీయాంశంగా మారింది.