వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తులు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో చాలా మంది విలన్లు వుంటారని.. కానీ హీరో మాత్రం ఒక్కడేనని, అలాగే వైఎస్ జగన్ కూడా ఒంటరిగానే యుద్ధం చేస్తారని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటికి కాలు చాపిన వారికి స్మశానమే గుర్తుకు వస్తుందని, చంద్రబాబు కూడా కాటికి కాలు చాపాడరని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో దాదాపు 27 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే చాలా మంది ఇళ్లు నిర్మించుకుని, గృహ ప్రవేశాలు కూడా చేశారని వల్లభనేని తెలిపారు.
పేదలకు ఇంత మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు పనికిమాలిన సన్నాసులంటూ వంశీ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని.. అలాంటి వాళ్లు జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. సినిమాలో చాలా మంది విలన్లు వుంటారని.. కానీ హీరో మాత్రం ఒక్కడేనని, అలాగే జగన్ కూడా ఒంటరిగానే యుద్ధం చేస్తారని వల్లభనేని వంశీ అభివర్ణించారు.
Also Read: అక్రమాలను అడ్డుకోండి.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..
అంతకుముందు మంత్రి అంబటి రాంబాబు సైతం చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం పనుల పురోగతిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందన్నారు. పోలవరం పురోగతి ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని.. సోమవారం పోలవరమంటూ చంద్రబాబు ప్రచారానికే పరిమితమయ్యారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ తప్పిదంతో రూ.2,200 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు.
ఇంతటి నష్టం జరిగితే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదని రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం కడుతుందంటూ గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. రూ.12,911 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని అంబటి రాంబాబు తెలిపారు. సీఎం జగన్ చొరవతోనే నిధుల కొరత సమస్యల తీరిందని.. పోలవరం చూస్తామంటూ టీడీపీ నేతలు హంగామా చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. పోలవరం చూస్తామంటూ టీడీపీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది టీడీపీయేనన్న ఆయన.. పోలవరంపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని అంబటి దుయ్యబట్టారు.
