టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గన్నవరం వైసీపీలో గ్రూపుల పంచాయతీ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కృష్ణా జిల్లా (krishna district) గన్నవరం (gannavaram) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ (ysrcp) మద్దతుదారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) , టీడీపీ (tdp) నేత వంగవీటి రాధా (vangaveeti radha) భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు మిత్రుల మధ్య భేటీ ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో కలుసుకున్న వీరిద్దరూ కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు. ఇది కాస్తా మీడియా కంటపడింది. 

ఇదిలా ఉంటే.. ఇటీవల వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఇద్దరూ కలుసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేత వంగవీటి రాధాను వల్లభనేని వంశీ విజయవాడలోని రాధా కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా బందరు రోడ్డులోని ఆయన విగ్రహానికి రాధా, వంశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ALso Read:Vallabhaneni Vamsi: వైసీపీలో ముదురుతున్న‌ అధిప‌త్య పోరు.. యార్లగడ్డకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్‌

2019లో తెలుగుదేశం పార్టీ (telugu desam party) తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ.. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (ys jagan mohan reddy) మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి అధికార వైసీపీకి మద్దతుదారుడిగా ఉన్నారు. కాగా, వైసీపీలో మొదట కొనసాగిన వంగవీటి రాధా.. సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా గత ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బయటకు వచ్చి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో ఇద్దరు మిత్రులు తరచూ భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

గన్నవరంలో వైసీపీ నేతలతో వంశీ ఇమడలేకపోతున్నారు. పలుమార్లు విభేదాలు రచ్చకెక్కుతుండటంతో వైసీపీ అధిష్టానం తాడేపల్లికి పిలిపించి మందలించిన సందర్భాలు ఎన్నో. నిన్న గాక మొన్న కూడా గన్నవరం పంచాయతీ వైసీపీలో చర్చనీయాంశమైంది. తాజాగా తన చిరకాల మిత్రుడు వంగవీటి రాధాతో వంశీ భేటీ మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలోకి వల్లభనేని వంశీని ఆహ్వానించారా..? లేక వైసీపీలోకి వంగవీటిని వల్లభనేని రావాలని కోరారా అన్న చర్చ జరుగుతోంది. 

అయితే వల్లభనేని వంశీకి టీడీపీలో ప్లేస్ లేనట్లే.. ఎందుంటే ఇటీవల చంద్రబాబు కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై తెలుగుదేశం శ్రేణులతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా ఫైరయింది. ఏకంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలను చంపితే తన వాటాగా డబ్బులిస్తానంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కౌన్సిలర్ వార్నింగ్ ఇవ్వడం సైతం చర్చనీయాంశమైంది.