అమరావతి:  రాజధాని స్థానంలో మెగా టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు.

గురువారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతులు కోర్టులకు వెళ్లే కంటే చర్చలకు వెళ్తే మంచిదని ఆయన సూచించారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మాణం జరిగే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని స్థానంలో మెగా టౌన్ షిప్ నిర్మాణం చేపడితే రైతుల భూమికి ధర వస్తోందని ఆయన చెప్పారు.15 వేల ఎకరాల్లో  టౌన్‌షిప్ తీసుకువస్తే రైతులకు నష్టం లేకుండా చూడొచ్చన్నారు. ఈ విషయాన్ని రైతులు అంగీకరిస్తే  సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఎయిర్ పోర్ట్ కు భూములిచ్చిన వారికి కూడ టౌన్ షిప్ లో ప్లాట్స్ ఇవ్వొచ్చని కూడ ఆయన సూచించారు.రైతులకు ఏదో ఒక పరిష్కారం చూపాలన్నదే తన అభిమతమని ఆయన తెలిపారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెర మీదికి తెచ్చింది. అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.