సంకల్పసిద్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి: డీజీపీకి వల్లభనేని వంశీ వినతి
సంకల్పసిద్ది విషయంలో తనపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. సంకల్పసిద్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరినట్టుగా చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారంనాడు కలిశారు.సంకల్పసిద్ది కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరినట్టుగా వల్లభనేని వంశీ చెప్పారు. సంకల్పసిద్దితో తనకు సంబంధం లేకున్నా కూడా తనపై టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని వల్లభనేని వంశీ మండిపడ్డారు. టీడీపీలో ఉంటే మంచోళ్లు బయటకు వస్తే చెడ్డొళ్లా అని వంశీ ప్రశ్నించారు. సంకల్పసిద్ది విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని కూడా తాను కోరినట్టుగా ఆయన చెప్పారు. ఈ సంస్థకు రాజకీయ నేతలతో సంబంధం లేదని ఇప్పటికే సీపీ ప్రకటించిన విషయాన్ని వంశీ ప్రకటించారు. అయినా కూడా తనకు, మాజీ మంత్రి కొడాలి నానికి ఈ సంస్థతో సంబంధం ఉన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషయమై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు బచ్చుల అర్జునుడు, పట్టాభిలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు తనపై తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా వంశీ తెలిపారు.