ఈజీగా మనీ సంపాందించడానికి గంజాయి స్మగ్లర్లుగా మారిన నలుగురు యువకులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసారు.
గుంటూరు : విద్యార్థుల ముసుగులో గంజాయి దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఒరిస్సా నుండి ఆంధ్ర ప్రదేశ్ కు గంజాయి తరలిస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారినుండి కేజీకి పైగా గంజాయి, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించిన పోలీసులు వివరాలిలా ఉన్నాయి. కేఎల్ యూనివర్సిటీలో చదివే ఒరిస్సా యువకులు మనీష్ కుమార్, గుండ్ల సందీప్ ఈజీగా మనీ సంపాదించేందుకు గంజాయి దందా చేస్తున్నారు. వీరికి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దాసరి శ్రీకాంత్,విజయవర్ధన్ లు గంజాయి అమ్మడానికి సహకరించేవారు. ఒరిస్సా నుండి మనీష్, సందీప్ గుట్టుగా గంజాయిని తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో అమ్మేవారు. విద్యార్థులు కావడంతో వీరిపై ఇంతకాలం ఎవరికీ అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మగా వచ్చిన డబ్బులతో నలుగురు జల్సాలు చేసేవారు.
వీడియో
అయితే ఇటీవల తాడేపల్లి పరిసరాల్లో గంజాయి విరివిగా లభిస్తుందన్న స్థానికుల సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే తనిఖీలు చేపడుతుండగా కుంచనపల్లి లో గంజాయిని తరలిస్తున్న ఈ నలుగురు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిలోన్నరకు పైగా గంజాయితో పాటు కేటిఎం బైక్ స్వాధీనం చేసుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
జల్సాలకు అలవాటుపడి యువత ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు పోలీసులు సూచించారు.
