డబ్బుల కోసం స్కూల్ విద్యార్ధినీ వదలని వైనం.. బెజవాడలో రెచ్చిపోతోన్న బ్లేడ్ బ్యాచ్
విజయవాడలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పట్టపగలు హల్‌చల్ చేసింది. డబ్బుల కోసం ఏకంగా స్కూల్ పిల్లలను కూడా వదలడం లేదు. జమ్మి చెట్టు బీఎస్ ఆర్కే స్కూల్ వద్ద ఓ విద్యార్ధిని వారు వెంబడించారు.
విజయవాడలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు మళ్లీ రెచ్చిపోతున్నాయి. మాచవరం పరిధిలోని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్ధిని అడ్డగించి డబ్బుల కోసం బ్లేడ్‌లతో దాడి చేశారు. జమ్మి చెట్టు బీఎస్ ఆర్కే స్కూల్ వద్ద ఈ దారుణం జరిగింది. వారి నుంచి విద్యార్ధి తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. గంజాయి బ్యాచ్ ఆగడాలతో స్కూల్ దగ్గర సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. విద్యార్ధులతో పరిచయాలు పెంచుకుని వారిని చెడ్డదారి పట్టిస్తున్నారు గంజాయి, బ్లేడ్ బ్యాచ్. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఇళ్లపై దాడిచేసి అడ్డొచ్చిన వారిని బ్లేడ్ తో గాయపర్చి దోపిడీకి పాల్పడే స్థాయినుండి ఇప్పుడు నడిరోడ్డుపై దారిదోపిడీలకు పాల్పడే స్థాయికి ఈ బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు పెరిగాయి. ఇలా నిత్యం రద్దీగా వుండే జాతీయ రహదారిపై నిద్రిస్తున్న ఓ లారీ డ్రైవర్ పై అత్యంత క్రూరంగా బ్లేడ్లతో దాడిచేసింది ఈ కసాయి బ్యాచ్. ఈ దారుణం సెప్టెంబర్‌లో ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Also REad:ఎన్టీఆర్ జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అరాచకం... నడిరోడ్డుపై లారీ డ్రైవర్ పై దాడి
పోలీసుల కథనం ప్రకారం... కర్నూల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన కలీమ్ (42) లారీ డ్రైవర్. ఇతడు లారీలో లోడ్ తీసుకుని వెళుతూ విజయవాడ రూరల్ మండలంలో ఆగాడు. గూడవల్లి జాతీయ రహదారి పక్కన లారీ ఆపి అందులోనే నిద్రించాడు. అయితే అర్ధరాత్రి కలీమ్ గాడనిద్రలో వుండగా బ్లేడ్ బ్యాచ్ ఎంటరై దాడికి తెగబడ్డారు. డబ్బులు, సెల్ ఫోన్ ఇవ్వాలని లారీ డ్రైవర్ ను బెదిరించగా అతడు ప్రతిఘటించాడు. దీంతో అతడిపై బ్లేడ్ తో అతి దారుణంగా గాయపర్చి ఐదువేల నగదు, సెల్ ఫోన్ ను దొంగిలించారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో పడిపోయిన కలీమ్ ను గుర్తించిన వాహనదారులు 108 కు సమాచారమిచ్చారు. వెంటనే అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుని కలీమ్ ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.