అవిశ్వాసంపై చర్చ: కేశినేనికి షాక్.. రేపు టీడీపీ ఓపెనర్‌ గల్లా జయదేవ్

Galla jayadev as TDP Speaker in debate of no confidence motion
Highlights

అవిశ్వాసం సందర్భంగా టీడీపీకి స్పీకర్ ఎంత సమయం కేటాయిస్తారు..? ఎంతమందిని మాట్లాడేందుకు అనుమతినిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఎంతసేపు సమయం ఇచ్చినప్పటికీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను మాట్లాడించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

కేంద్రప్రభుత్వంపై ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవిశ్వాసం పెడతామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈసారి గోల్ కొట్టింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇచ్చిన అవిశ్వాస  తీర్మానంపై చర్చకు అంగీకరిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ.. ఇతర పార్టీల మద్ధతు కూడగట్టేందుకు విపక్షాలు వేగంగా పావులు కదుపుతున్నాయి.

ఇక ఏపీ ప్రయోజనాల కోసం అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీ సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం.. ఇప్పటి వరకు కేంద్రం అందజేసిన నిధులు తదితర అంశాలను పార్లమెంట్‌కు వివరించి.. బీజేపీని నిలదీయాలని భావిస్తోంది. అవిశ్వాసం నెగ్గడం అన్నది కలల మాట.. కాకపోతే తమ రాష్ట్రానికి న్యాయం జరగలేదు అన్న విషయాన్ని దేశవ్యాప్తంగా ఫోకస్ చేసి ప్రజల దృష్టిలో బీజేపీని దోషిని చేయాలన్నది తెలుగుదేశం ప్లాన్.

ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బీజేపీ గత బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాసం చర్చకు రాకుండా పావులు కదిపింది. అయితే ఈసారి మాత్రం చర్చకు అనుమతించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్ర సాయం తదితర అంశాల  గురించి లోక్‌సభకు తెలియజేయాల్సిన బాధ్యత టీడీపీది. అవిశ్వాసం సందర్భంగా టీడీపీకి స్పీకర్ ఎంత సమయం కేటాయిస్తారు..? ఎంతమందిని మాట్లాడేందుకు అనుమతినిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

ఎంతసేపు సమయం ఇచ్చినప్పటికీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను మాట్లాడించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.. గతంలో లోక్‌సభ సాక్షిగా ఏపీ కష్టాల విషయంలో ప్రధాని మోడీ సహా అగ్రనేతలను జయదేశ్ కడిగిపారేశారు.

ఏపీకి ఇచ్చిన ఎన్నో హామీల్లో ఏ  ఒక్కటి అమలు చేయలేదని.. కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయనే కారణంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని.. మీరిచ్చిన నిధుల కంటే బాహుబలి కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు జోకులు వేసుకుంటున్నారంటూ జయదేవ్ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనం కలిగించింది. చక్కటి వాగ్థాటితో.. సూటిగా సుత్తి లేకుండా పాయింట్ టూ పాయింట్ మాట్లాడగల జయదేవ్ వైపే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపింది.

ఇందుకు తగ్గట్టుగానే శుక్రవారం మాట్లాడాల్సిన  అంశాల గురించి ఆయనకు అవగాహన కల్పిస్తున్నారు.. మొత్తానికి అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన కేశినేనినే అవిశ్వాసంపై చర్చను ప్రారంభిస్తారని అంతా భావించారు. మీడియాలో సైతం కథనాలు ఇలాగే వచ్చాయి. కానీ చంద్రబాబు వ్యూహాం మార్చి నానికి బదులు జయదేవ్‌కే ఆ అవకాశం ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. కేశినేని నానికి విషయాన్ని వివరించడంతో ఆయన కూడా పార్టీ అధిష్టానం సూచనల మేరకే నడుచుకుంటానని తెలిపారు. అలాగే మధ్యలో వచ్చే అవకాశాన్ని కేశినేని, రామ్మోహన్ నాయుడు వినియోగించుకోవాలని టీడీపీ అధినేత సూచించినట్లుగా తెలుస్తోంది. 

loader