ఓఎంసీ పదవికి గాలి జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. ఓఎంసీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై సోమవారం వాదనలు కొనసాగాయి. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఓఎంసీ కంపెనీ డైరెక్టర్‌ పదవికి గాలి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసినట్లు తెలిపారు. 

కంపెనీ లావాదేవీల గురించి ఆయనకు తెలియదన్నారు. బళ్లారి ఐరన్‌ ఓర్‌ సంస్థపై కూడా కేసు ఉన్నా.. సీబీఐ కేవలం ఓఎంసీ కేసులోనే దర్యాప్తు చేసిందన్నారు. మైనింగ్‌లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోందని.. అయితే, సరిహద్దు వివాదమే తేలలేదని పేర్కొన్నారు.

ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఆరోపణలు మోపడం సరికాదన్నారు. మరో నిందితుడు గాలి జనార్దన్‌ రెడ్డి పీఏ నేఫాజ్‌ ఆలీఖాన్‌ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌లో అతని తరఫు న్యాయవాది వాదిస్తూ.. అక్రమ మైనింగ్‌కు కుట్ర చేసినట్లు సీబీఐ రుజువు చేయలేదన్నారు. ఈ వ్యాజ్యంలో మరో నిందితుడు, గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది.