అమరావతి: నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీచిందా....?నియోజకవర్గంలో అసమ్మతి ఆ పార్టీని కొంపముంచాయా....?సొంత పార్టీ అభ్యర్థిని ఓడించాలన్న కక్షతో ప్రత్యర్థి పార్టీకి సహకారం చేశారా....?

ఓట్లు వేయించడమే కాదు ఆర్థికంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సహకరించారా...ఈ అంశాలపైనే నగరి నియోజకవర్గంలో హాట్ టాపిక్ చర్చ జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భాను ప్రకాశ్ పోటీ చేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరిగి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం గాలి భాను ప్రకాశ్ కు హ్యాండ్ ఇచ్చిందని ప్రచారం జోరుగా సాగుతోంది. టికెట్ కేటాయింపులు దగ్గర నుంచి ఎన్నికల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది నగరి నియోజకవర్గం. 

గాలి భాను ప్రకాశ్ కు ఇవ్వొద్దంటూ స్వయానా సొంత తమ్ముడు గాలి జగదీష్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తాను పోటీ చేస్తానని తనకే అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. తన తండ్రి తననే రాజకీయ వారసుడిగా ప్రకటించారంటూ గాలి భాను ప్రకాశ్ కూడా చెప్పుకొచ్చారు. 

గాలి ముద్దు కృష్ణమ నాయుడు భార్య సరస్వతి సైతం గాలి భానుప్రకాశ్ కి కాకుండా చిన్నకొడుకు గాలి జగదీష్ కే మద్దతు పలికారు. చంద్రబాబు నాయుడు పలుమార్లు కూర్చోబెట్టి హితబోధ చేస్తే చివరికి గాలి భానుప్రకాశ్ కి మద్దతు పలికారు తల్లి ఎమ్మెల్సీ సరస్వతి, సోదరుడు గాలి జగదీష్. 

ఇంటి పోరు చక్కబెట్టుకునేలోపే పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అయిపోయాని టాక్. తెలుగుదేశం పార్టీలో ఓ కీలకంగా ఉన్న ఓ నేత గాలి భాను ప్రకాశ్ కి సహకరించలేదని తెలుస్తోంది. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కీలక నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజాకు ఆర్థికంగానూ సహకరించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. 

అయినప్పటికీ గాలి భాను ప్రకాశ్ రోజాకు గట్టి పోటీ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ఆ నేతపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాశ్ తోపాటు నియోజకవర్గం టీడీపీ కీలక నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. 

సోమవారం సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆ కీలక నేతపై ఫిర్యాదు చెయ్యనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ కీలక నేత ఎవరో అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే మరి.