విశాఖపట్నం రిషికొండ బీచ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీకి చెందిన కండ్యాన సంతోష్‌, విశాలాక్షి నగర్‌కు చెందిన మొహమ్మద్‌ క్వాజా మొయిద్దీన్‌ చిస్తీ, విజయనగరం అలకానంద కాలనీకి చెందిన చట్టుముల తేజా అలియాస్‌ యువ తేజ, గోపాలపట్నం చంద్రనగర్‌కు చెందిన ఓరుగంటి వాసుదేవ్‌ కౌండిన్యలను మంగళవారం రాత్రి సీతకొండ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 

ఇప్పటికే మానుకొండ సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిపై మాదకద్రవ్య నిరోధక చట్టం సెక్షన్‌ 21ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. వీరి నుంచి 9.700 గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌, 5 ఎల్‌ఎస్‌డీ చిప్స్‌, 1.09 గ్రాముల కొకైన్‌, రూ.1380 నగదు, 5 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 

రేవ్‌ పార్టీ నిర్వహించిన సాయి రాఘవ చౌదరి అలియాస్‌ సోనూను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. మానుకొండ సత్యనారాయణ గోవాలో, సంతోష్‌ డార్క్‌ వెబ్‌ ద్వారా మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు.

శనివారం రిషికొండ బీచ్ లో నిర్వహించిన రేవ్ పార్టీలో యువత ఎక్కువగా పాల్గొని డ్రగ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రాము రూ.4వేలు పెట్టిమరీ యువత డ్రగ్స్ ని కొనుగోలు చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు.