అమరావతి: విశాఖకు చెందిన ముగ్గురు కీలక నేతలు ప్రస్తుతం ఏ  పార్టీలో కూడ లేరు.  అయితే  ఎన్నికలు సమీపిస్తున్నందున  త్వరలోనే  ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.విశాఖకు చెందిన  మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, సబ్బం హరిలపై ప్రధాన పార్టీలు ఆసక్తిని చూపుతున్నాయి. 

2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు  వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ స్థానం నుండి  దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ రావు  వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత దాడి వీరభద్రరావు వైసీపీకి కూడ గుడ్‌బై చెప్పారు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడి వీరభద్రరావు టీడీపీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం సాగింది.కానీ  ఇప్పటివరకు  ఆయన టీడీపీలో చేరలేదు. విశాఖ జిల్లా పర్యటనకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా దాడి వీరభద్రరావుతో ఆయన సమావేశమయ్యారు.  పార్టీలో చేరాలని దాడి వీరభద్రరావును ఆహ్వానించారు.

అయితే దాడి వీరభద్రరావు మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో దాడి సంప్రదింపులు జరిపారు. ఆయన్ను తీసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సుముఖత చూపారు. కానీ ఫలానా సీటు ఇస్తామని హామీ ఇవ్వలేదు.దీంతో దాడి వీరభద్రరావు టీడీపీలో చేరికపై ఇంకా స్పష్టత లేదు.

 విశాఖ జిల్లాలోని సీనియర్‌ నేతల్లో ఒకరైన మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ కూడా ఇంకా ఏ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్‌ హయాంలో ఆయన ప్రాధాన్య నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీకి కూడ గుడ్‌బై చెప్పారు.  అయితే విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై  చర్చా వేదికలను నిర్వహిస్తున్నారు.   వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలం క్రితం ఆయనతో టీడీపీ వర్గాలు సంప్రదింపులు జరిపాయి. అయితే కొణతాల చేరికపై ఇంకా స్పష్టత రాలేదు. కొణతాల కూడ  ఏ విషయాన్ని  తేల్చలేదనే ప్రచారం కూడ ఉంది.

మరోవైపు మాజీ ఎంపీ సబ్బం హరి కూడ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చే  పార్టీలో తాను చేరుతానని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. 

ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా సబ్బం హరి మాట్లాడారు.  అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిని చూపుతున్నారు. అయితే  కొంత టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల రవీంద్రారెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మైదుకూరు నుండి డీఎల్ రవీంద్రారెడ్డి గతంలో ప్రాతినిథ్యం వహించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడుతో డీఎల్ సమావేశమయ్యారు.  టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు.

అయితే మైదుకూరు టిక్కెట్టును సుధాకర్ యాదవ్ కు కేటాయించడంతో డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరలేదు.అయితే  తాజాగా పుట్టా సుధాకర్ యాదవ్ కు చంద్రబాబునాయుడు టీటీడీ చైర్మెన్ పదవిని  కట్టబెట్టారు.

డీఎల్ రవీంద్రారెడ్డి కోసమే  సుధాకర్ యాదవ్ కు ఈ పదవిని కట్టబెట్టారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ తరుణంలో డీఎల్ రవీంద్రారెడ్డి కోసం వైసీపీ నాయకత్వం కూడ పావులు కదుపుతోంది. అయితే  ఏ పార్టీలో చేరాలనే దానిపై  డీఎల్  ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.