ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే రోజు నలుగురు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. అమ్మాయిల ఆఛూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. 

చిత్తూరు : ఒకే రోజు నలుగురు అమ్మాయిల మిస్సింగ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో అమ్మాయిలు కనబడకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయిల మిస్సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన మౌనిక మంగళవారం నుండి కనిపించడంలేదు. ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో పాటు బంధువుల ఇంటికేమైనా పోయిందేమోనని కుటుంబసభ్యులు ఆరా తీసారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 

ఇక చిత్తూరు పట్టణంలోనూ ఇలాగే మరో యువతి కనిపించకుండా పోయింది. చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే రితిక నిన్నటి నుండి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read More వృద్దుల పించన్ డబ్బులతో జూదమాడి... అడ్డంగా బుక్కయిన వాలంటీర్

ఇదే చిత్తూరు జిల్లా వి.కోట ప్రాంతానికి చెందిన కోమల, పుంగనూరుకు చెందిన ఝూన్సీ కూడా మంగళవారం నుండి కనిపించడం లేదు. ఇలా ఒకేరోజు నలుగురు అమ్మాయిలు మిస్సవడం అనేక అనుమానాలకు రేకెత్తిస్తోంది. అమ్మాయిలను ఎవరైనా కిడ్నాప్ చేసి ఏదయినా అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక అమ్మాయిలే ఎక్కడికైనా వెళ్ళారా? ఏదయినా ప్రమాదంలో చిక్కుకున్నారా? అన్న అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 

బిడ్డలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ అమ్మాయిల ఆఛూకీ కోసం గాలిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అమ్మాయిల వివరాల పంపించి అలెర్ట్ చేసారు. నలుగురు అమ్మాయిలను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.