వారంతా పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపారు. మరింత సరదా కోసం సముద్ర తీరానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నలుగురు చిన్నారులు నీటమునిగి గల్లంతయ్యారు. ఈ విషాదం బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
అమరావతి: బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజాంపట్నం హార్బర్ వద్ద సముద్ర స్నానానికి వచ్చిన 40మందిలో నలుగురు చిన్నారులు నీటమునిగి గల్లంతయ్యారు. వారిలో ఓ బాలిక ఇప్పటికే మృతిచెందగా మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరు చిన్నారుల ఆఛూకీ లభించాల్సి వుంది.
తెనాలిలో జరిగిన పెళ్లివేడుకకు హాజరైన బంధువులు సరదాగా గడిపేందుకు నిజాంపట్నం హార్బర్ వద్దకు వెళ్లారు. ఇలా పిల్లాపాపలు, ఆడ మగ అంతా కలిసి 40మంది వరకు నిజాంపట్నం సముద్ర తీరానికి చేరుకున్నారు. వీరంతా ఓ బోటులో సముద్రంలోకి వెళ్లారు. అయితే అలల తాకిడి ఎక్కువ కావడంతో బోటు ఎక్కువగా కదలడంతో అందరూ భయపడిపోయారు. దీంతో తోపులాట జరగ్గా చిన్నారులు బోటులోంచి సముద్రంలోకి పడిపోయారు.
సముద్రంలో గల్లంతయిన చిన్నారులు సుల్తాన (12), అస్సద్ ఖాన్ (10), మాహే జభిన్ (8), షాహిద్ (6) గా గుర్తించారు. వీరిలో ఇప్పటికే సుల్తానా మృతదేహం లభించగా మరో బాలుడు కొనఊపిరితో లభించాడు. అతడికి తెనాలి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Video
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిజాంపట్నం హార్బర్ కు చేరుకుని గజఈతగాళ్ల సాయంతో చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. యాత్రకు వచ్చినవారందరూ తెనాలి మారిస్ పేటకు చెందిన వారిగా గుర్తించారు. నిజాంపేట హార్బర్ వద్ద గల్లంతయిన చిన్నారుల తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.
గత వారం కూడా ఇలాంటి దారుణమే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జరుగుమల్లి మండలంలోని అక్కచెరువుపాలెంలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. ఒకేరోజు ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇక గత నెలలో ఇలాగే సరదాగా సముద్రపు ఒడ్డున గడిపేందుకు వెళ్లిన ఇద్దరు బీ ఫార్మసీ అమ్మాయిలు నీటమునిగి మృతిచెందిన దుర్ఘటన మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలోని విష్ణు కాలేజీలో కాకర ప్రమీల (22), కల్లేపల్లి పూజిత (22) మంగినపూడి బీచ్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే సముద్ర నీటిలోకి దిగిన ఇద్దరూ అలల తాకిడిలో లోతులోకి కొట్టుకుపోయారు.
అమ్మాయిలిద్దరూ కొట్టుకుపోవడాన్ని గమనించినవారు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గల్లంతయిన అమ్మాయిలను ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే అమ్మాయిలిద్దరూ అనస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఒడ్డుకు చేరిన కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
