అమరావతి:నిబంధనల ప్రకారంగానే బాధ్యతల్ని స్వీకరించానని మాజీ ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. హైకోర్టు నా హక్కులను గుర్తించిందన్నారు.

ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం మీడియా సమావేశంలో లేవనెత్తిన అంశాలపై ఆదివారం నాడు మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. 

also read:నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్: సర్క్యులర్ ఉపసంహరణ

తన పదవి కాలం పూర్తయ్యే వరకు కొనసాగమని ఆర్డర్ కాపీలో ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఎస్ఈసీ పదవిని ఖాళీగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 

నిబంధనలను తాను ఏనాడూ కూడ ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని, స్వతంత్రను ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదన్నారు. 

ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందన్నారు. హైకోర్టు తీర్పును ధిక్కరించేలా ప్రభుత్వం తీరు ఉందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు తన పదవీకాలం ఉందని ఆయన గుర్తు చేశారు.

ఈ నెల 29వ తేదీన ఏపీ రాష్ట్ర హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల సంఘంలో మార్పులు చేర్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేసింది.. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూడ హైకోర్టు కొట్టివేసింది.