అనంతపురం: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించాడు. వంద రోజుల పాలనపై జగన్‌కు వంద మార్కులు పడాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేసి వంద రోజులు దాటింది. ఈ సమయంలో వంద రోజుల పాలనపై  మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించాడు. వంద రోజుల పాలనపై వంద మార్కులు వేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా  జగన్ మావాడే అని ఆయన స్పష్టం చేశారు.

మా వాడు చాలా తెలివైన వాడు అంటూ జగన్‌ పై జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జగన్ ను నడిపించే నాయకుడు ఒకడు కావాలని ఆయన కోరారు. తన సలహాలు జగన్ అడిగితే అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు.

రాష్ట్రానికి మంచి జరగాలి.. జగన్ కు మంచి జరగాలని తాను కోరుకొంటున్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని దాన్ని నేలకేసి కొట్టొద్దన్నారు. 

రాజధాని అమరావతిలోనే ఉంటుందన్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించకుండానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం అదనపు భారమే అని ఆయన  అభిప్రాయపడ్డారు.జగన్ వంద రోజుల పాలనపై  టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న సమయంలో  జేసీ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.