జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా
వంగవీటి రాధా అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం నాడు ఆయన తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో సాగిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అమరావతి: ఏ జిల్లాలో సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే జగన్ వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు.
అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ బుధవారం నాడు పాల్గొన్నారు. తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో రాధాకృష్ణ పాల్గొన్నారు. అమరావతితో పాటు 29 గ్రామాలకు చెందిన ప్రజలు 27 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజధాని పరిసర గ్రామాల్లో టీడీపీ, జేఎసీ నేతలు బుధవారం నాడు జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికల ప్రతులను దగ్ధం చేశారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పాల్గొన్నారు. రైతుల ఆందోళనలకు మద్దతు పలికారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 30 రాజధానులు వైసీపీ అనుకోనివ్వండి మాకు తెలిసిన రాజధాని, రాష్ట్రం ఒక్కటే అని వంగవీటి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.
వంగవీటి రాధా ఇటీవలనే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లను కలిశారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత వంగవీటి రాధా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జనసేనలో వంగవీటి రాధా చేరుతారనే ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్‌ను కూడ ఆయన కలిశారు. కానీ, చాలకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళనల్లో వంగవీటి రాధా పాల్గొనడం ద్వారా తిరిగి రాజకీయాల్లో మరోసారి చురుకుగా పాల్గొనే అవకాశం ఉందని రాధా సన్నిహితులు చెబుతున్నారు.