కొడుకు భారీ నుంచి తమను కాపాడాలని ఓ మాజీ ఎమ్మెల్యే భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసకుంది.
కొడుకు భారీ నుంచి తమను కాపాడాలని ఓ మాజీ ఎమ్మెల్యే భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసకుంది. వివరాలు.. పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు రవిబాబు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే తాజాగా నారాయణమూర్తి భార్య వెంకటలక్ష్మి.. సొంత కొడుకు రవిబాబుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన కొడుకు వేధింపుల నుంచి తనను, నలుగురు కుమార్తెలను కాపాడాలని కోరారు. ఆస్తి కోసం నిత్యం నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నాననే జాలి కూడా లేకుండా వేధిస్తున్నాడని తెలిపారు.
వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు వల్ల మానసిక వేదన అనుభవిస్తున్నానని చెప్పారు. తన భర్తను కూడా హింసించాడని తెలిపారు. తన భర్త ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెత్తనం అతడికి ఇవ్వాలని గొడవ చేసేవాడని.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడేవాడని అన్నారు. అతడు అడిగింది కాదంటే తండ్రి అని కూడా చూడకుండా కొట్టేవాడని చెప్పారు. అడ్డువెళితే తనపై కూడా దాడి చేశాడని ఆరోపించారు. తల్లిదండ్రులుగా తమను చూడలేదని అన్నారు. తన కొడుకు మీద ఫిర్యాదు చేయడానికి వచ్చానని.. పోలీసులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.
ఇక, నారాయణమూర్తి గతంలో టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి కాగా.. తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆయన 2014లో పి గన్నవరం నియోజకర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత పులపర్తి నారాయణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది జూలైలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు.
