అమరావతి: వైయస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీమంత్రి,శాసనమండలిలో ప్రతిపక్ష నేత  యనమల రామకృష్ణుడు. వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేసి నీతి వ్యాఖ్యలు చెప్తారా అంటూ మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రంగులకే వందల కోట్లు దుబారాగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు పొదుపుపై నీతివ్యాఖ్యలు చెప్తోందంటూ మండిపడ్డారు. 4 నెలల్లోనే తన ఇంటికి రూ.16కోట్లు ఖర్చు చేసిన పెద్దమనిషి, ఒక్క పైసా కూడా వృథా చేయవద్దని అధికారులకు చెప్పడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. 

ప్రజావేదిక కూల్చడం వల్ల రూ.9కోట్ల ప్రజాధనం వృథా కాలేదా అని నిలదీశారు. వ్యక్తిగత పర్యటనలకు విదేశాలకు వెళ్తూ, వాటికి ముసుగేసి కోట్లు ఖర్చు పెట్టడం పొదుపు చర్యా అంటూ ప్రశ్నించారు. 
 
4లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్లు, సచివాలయాల ముసుగులో ఏడాదికి రూ.8వేల కోట్లు దుబారా చేయడం పొదుపా అంటూ యనమల ఫైర్ అయ్యారు. సాక్షి మీడియా యాడ్స్ రేట్లు 150% నుంచి 200% అధికం చేయడాన్ని పొదుపు చర్య అంటారా అంటూ నిలదీశారు. 

సాక్షి ఉద్యోగులకు, పోస్ట్‌లు సృష్టించి ప్రభుత్వ జీతాలు చెల్లిస్తున్నారని ఇది సరికాదన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి లేనట్లుగా 40మంది సలహాదారులను నియమించి వారికి కోట్లాది రూపాయల జీతాలు ఇస్తున్నారంటూ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. 

వేలకోట్ల బిల్లులు పెండింగ్ పెట్టినట్లు టీడీపీపై సీఎం జగన్ ఆరోపణలు చేయడం దివాలాకోరుతనానికి నిదర్శమని చెప్పుకొచ్చారు. రూ.16వేల కోట్ల ఆర్ధికలోటు, విభజన కష్టాలు, పెండింగ్ బిల్లులతో ఉన్న రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వ కృషితో ఒక గాడిలోకి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. 

డిసెంబర్ 9 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

శాసన సభ శీతాకాల సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 6 నెలలుగా వైసీపీ చేస్తున్న అవినీతి అక్రమాలను సభలో ఎండగట్టాలంటే సభను 15రోజులపాటు నిర్వహించాల్సిందేనని మాజీమంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.