అమరావతి:  విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దుర్భాషలాడిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఛలో ఆత్మకూరు నేపథ్యంలో పోలీసులపై దుర్భాషలాడిన కేసులో ఆయన శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. 

ఛలో ఆత్మకూరు పిలుపులో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి బయలుదేరారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. అయితే అచ్చెన్నాయుడును పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసులు అడ్డుకోవడంపై అచ్చెన్నాయుడు ఆవేశంతో రగిలిపోయారు. ఎస్పీపై నిప్పులు చెరిగారు. పోలీసులపై దుర్భాషలాడారు. 

పోలీసులపై దుర్భాషలాడటం, విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారంటూ తాడేపల్లి పీఎస్‌‌లో ఫిర్యాదు చేశారు పోలీసులు. ఈ కేసులో మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్‌ జారీ అయింది. 

అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అచ్చెన్నాయుడుకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే ఈనెల 30 లోగా మెజిస్ట్రేట్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే రూ.25వేలు విలువైన రెండు పూచీకత్తులను సమర్పించి బెయిల్ పొందాలని ఆదేశించింది. హైకోర్టు సూచనలతో అచ్చెన్నాయుడు శుక్రవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. 

రూ.50వేల పూచీకత్తుతో మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.