శ్రీకాకుళం: ఏపీలో ఆర్టీసి ఛార్జీల పెంపుదలపై టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెవెలుగు, సిటి సర్వీసులు కి.మీకు 10పైసలు, మిగిలిన వాటిపై కి.మీకు 20పైసలు పెంచడాన్ని అచ్చెన్నాయుడు ఖండించారు. 

ఆర్టీసీ చార్జీల పెంపుదలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదముద్ర వేశారంటూ మంత్రి పేర్నినాని చెప్పడం ప్రజలను వంచించడమేనని ఆరోపించారు. 
ప్రజలపై పైసా భారం వేయనని పాదయాత్రలో చెప్పిన జగన్ ఆర్టీసీ ఛార్జీలను ఎలా పెంచుతారంటూ నిలదీశారు. 

పన్నులు, ఛార్జీలు పెంచే ప్రసక్తే ఉండదని ప్రజా సంకల్పయాత్రలో ప్రకటిస్తూ ప్రజలను నమ్మించిన జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ప్రజలను మోసం చేయడమేనంటూ మండిపడ్డారు. 

జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మరోసారి రుజువైందన్నారు. ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయం జగన్ చేతగానితనానికి నిదర్శనమంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఆర్టీసి రూ.1200 కోట్ల నష్టాలలో ఉందని చెప్పడం పెద్ద జోక్ అంటూ అభిప్రాయపడ్డారు. 

తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పేదలపై భారం మోపలేదని స్పష్టం చేశారు. భారాలు వేయకుండానే ఆర్టీసి బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. బస్సులు కొనడానికి భారీగా నిధులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 

ఆర్టీసి కార్మికులకు 42% ఫిట్ మెంట్ ఇచ్చినా ప్రజలపై భారం మాత్రం మోపలేదన్నారు. రూ.16వేల కోట్ల ఆర్ధికలోటులో కూడా ప్రజలపై భారాలు వేయని ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 

కరెంటు ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు పెంచేది లేదని తాము చెప్పామని దాన్ని ఆచరణలో పెట్టి నిరూపించామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం హామీ ఇవ్వడం దాన్ని మరచిపోవడంగా అలవాటు చేసుకుందన్నారు. వైసిపి ప్రభుత్వం పేదలను దారుణంగా మోసగించిందని ఆరోపించారు. 


వైసిపి పాలనలో పవర్ ఉండదు కానీ పవర్ ఛార్జీలు పెంచుతామన్నారు. ఆర్టీసిలో వసతులు పెంచరు గానీ ఛార్జీలు పెంచుతామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఉల్లి ధరలు విపరీతంగా పెంచేశారని తాజాగా ఆర్టీసి ఛార్జీలు పెంచుతున్నారంటూ మండిపడ్డారు. సామాన్యుడి నడ్డి విరగ్గొట్టడమే వైసిపి ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వమంటూ మండిపడ్డారు. 

తెలుగుదేశం అమలు చేసిన వెల్ఫేర్ స్కీమ్ లు అనేకం రద్దు చేసిందంటూ వైసీపీపై మండిపడ్డారు. ఆదరణ 2, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఫుడ్ బాస్కెట్ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేసిందంటూ ధ్వజమెత్తారు. 

వైసీపీ తెచ్చిన పథకాల్లో అన్నీ ఆంక్షలు, కోతలు పెట్టిందంటూ మండిపడ్డారు. పేదల సంక్షేమాన్ని కాలరాయడమే ధ్యేయంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 
సంక్షేమం ముసుగులో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్నే ఏకంగా అమ్మేయాలని చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. వీటన్నింటికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

కేసీఆర్ ఎఫెక్ట్: ఏపీలోనూ వడ్డన స్టార్ట్, పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు