అమరావతి: ఆయన మాజీ మంత్రి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగానూ పనిచేశారు. అయితే ఇంకేంటి తరతరాలు కూర్చుని తినేంత ఆస్తిని సంపాదించి వుంటాడు... ఏ బెంజ్ కారులోనూ తిరుగుతూ వుంటాడనుకుంటున్నారు కదా.... కానీ ఆయన మాత్రం ఫించను డబ్బుల అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయనే మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ. 

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన సత్యనారాయణ ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. టిటిడి పాలకమండలి సభ్యులుగా కూడా వున్నారు. అత్యంత కీలకమైన పదవుల్లో వుండి అవినీతికి ఆస్కారం వున్నా ఆయన అలా చేయలేదు. ఎలాంటి అవినీతి మరకలు అంటకుండానే రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు. 

అయితే అధికారంలో వుండగా ఎలాంటి మచ్చరాకుండా అవినీతికి దూరంగా వున్న అతడు ఆస్తులేమీ సంపాదించలేదు. దీంతో ప్రస్తుతం అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. కేవలం ఫించను డబ్బులతోనే జీవితం కొనసాగిస్తున్నారు. 

అయితే ఇటీవల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆయన సాయం కోసం సీఎం జగన్ ను కలవడానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.మాసిన దుస్తులు, అరిగిన చొప్పులతో ఉన్న ఆయన తాను మాజీ మంత్రిని అని చెప్పుకుంటున్నా వినకుండా పోలీసు గెంటేశారు. లోపలికి వెళ్లనీయడం అడ్డుకున్నారు. అయితే ఇది గమనించిన అక్కడున్న ఓ సీనియర్ అధికారి ఆయనను గుర్తుపట్టి ఆయనను లోపలికి అనుమతించారు. 

తొలుత పట్టించుకోని పోలీసులు తరువాత ఆయనతో  సెల్ఫీలు తీసుకున్నారు. అయితే సిఎం ఎంతకీ రాకపోవడంతో (రాత్రి 9గంటలకు వచ్చారు) వెళ్లిపోతానంటే పోలీసులే విజయవాడ వైపు వెళ్ళే కారు ఎక్కించారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయనకు తోడుగా వచ్చిన వ్యక్తి తెలిపారు. విజయవాడ వరకు బస్సులో అక్కడి నుండి షేర్ ఆటోలో అమరావతి వచ్చినట్లు తెలిపారు. ఫించను డబ్బులుతో కాలం గడపడుతున్నారని తెలిపారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే అంతులేని సంపదను కూడగట్టే రాజకీయాల్లో మంత్రిగా పనిచేసి కూడా ఇంత సాధారణ జీవితం గడుపుతున్న పెద్దాయన సత్యనారాయణను చూస్తే ఆశ్యర్యం మరోవైపు ఆవేదన కలుగుతుంది. నేటి రాజకీయాల్లో ఇలాంటి నాయకులు అరుదు... కాదు కాదు అసలు లేరని అంటున్నారు సత్యనారాయణ గురించి తెలిసినవారు.