జమ్మలమడుగు: కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఒకరి హత్యకు దారి తీసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన గొడవలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన ప్రతాప్ రెడ్డి మరణించాడు.

 

టీడీపీ నుండి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఈ ఏడాది ఆరంభంలో వైసీపీలో చేరాడు. వైసీపీలో చేరినా కూడ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య సఖ్యత మాత్రం లేదు.

జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం బీ అనంతపురంలో రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. .ముంపు పరిహారం కోసం సర్వే విషయంలో రెండు వర్గాలకు మధ్య  ఘర్షణ చోటు చేసుకొంది.

ఈ విషయమై రెండు గ్రూపులు పరస్పరం రాడ్లు, కర్రలు, రాళ్ల, కత్తులతో దాడికి దిగారు.  ఈ క్రమంలోనే రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన ప్రతాప్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతాప్ రెడ్డిని తాడిపత్రి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినా కూడ ఫలితం లేకుండా పోయింది. తాడిపత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రతాప్ రెడ్డి మరణించాడు.

ఈ ఘటనతో బి. అనంతపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.