కడప:  మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో రామసుబ్బారెడ్డి  వైసీపీలో చేరే అవకాశం ఉంది. రామసుబ్బారెడ్డితో పాటు టీడీపీకి చెందిన మరికొందరు నేతలు కూడ టీడీపీని వీడి వైసీపీలో చేరే చాన్స్ ఉందని చెబుతున్నారు.

Also read:షాద్ నగర్ జంట హత్యల కేసు: రామ సుబ్బారెడ్డికి సుప్రీంలో ఊరట

 కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి  రామ సుబ్బారెడ్డి పలు దఫాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో  దేవగుడి కుటుంబానికి రామసుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య  చాలా ఏళ్లుగా గొడవలు ఉన్నాయి.  

  2014 తర్వాత  దేవగుడి కుటుంబానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సమయంలో రామసుబ్బారెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. కానీ  వీరిద్దరి మధ్య చంద్రబాబునాయుడు  సయోధ్య కుదిర్చారు.

2019 ఏప్రిల్ లో ఎన్నికల సమయంలో కడప పార్లమెంట్ స్థానం నుండి ఆదినారాయణ రెడ్డి ఎంపీ స్తానానికి పోటీ చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి రామసుబ్బారెడ్డి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ కూడ వైసీపీ  అభ్యర్థుల చేతుల్లో  ఓటమి పాలయ్యారు. 

ఎన్నికల తర్వాత  ఏపీ రాష్ట్రంలో  వైసీపీ అధికారాన్ని చేపట్టింది. దీంతో  ఆదినారాయణరెడ్డి మాత్రం బీజేపీలో చేరారు.ప్రస్తుతం మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి  మాత్రం వైసీపీలో చేరాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. రామసుబ్బారెడ్డితో వైసీపీ కీలక నేతలు రెండు రోజుల క్రితం చర్చలు జరిపారని సమాచారం.

 రామసుబ్బారెడ్డితో పాటు రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు కూడ వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. పులివెందులకు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి కూ టీడీపీని వీడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 వైసీపీలో చేరే విషయమై రామసుబ్బారెడ్డి తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కనూడ ఈ విషయమై  వైసీపీ అగ్ర నేతలు ఒప్పించినట్టుగా  కడప జిల్లాలో  చర్చ సాగుతోంది. 

జమ్మలమడుగు నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన  ఆదినారాయణ రెడ్డి సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీగా  ఉంటూ ఇటీవల వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆదినారాయణరెడ్డి టీడీపీని వీడీ బీజేపీలో చేరారు.