హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో  రేవంత్ రెడ్డికి   డబ్బులిచ్చింది  చంద్రబాబు కాదా అని మాజీ మంత్రి, టీడీపీ బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో  చంద్రబాబునాయుడు ముద్దాయేనని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్దికోసం కులాల మధ్య చంద్రబాబునాయుడు చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. 

చంద్రబాబునాయుడు ఓడిపోవాలని కోరుకొనేందుకు తిరుపతికి వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  మీడియాతో మాట్లాడారు.  రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎస్సీ, ఎస్టీలను  వాడుకొంటున్నారని ఆయన బాబుపై మండిపడ్డారు.  చంద్రబాబునాయుడు ఎక్కడ అడుగుపెడతే అక్కడ నష్టమేనని ఆయన విమర్శించారు.

చంద్రబాబునాయుడు సింగపూర్‌లో పర్యటిస్తే  ఏపీలో వర్షాలు పడ్డాయని ఆయన గుర్తు చేశారు.ఎన్టీఆర్ వెనుక ఉన్నవారందరి మరణానికి చంద్రబాబునాయుడు కారణమని మోత్కుపల్లి ఆరోపించారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు  మరణానికి కూడ చంద్రబాబునాయుడే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.  తెలంగాణలో తనను అడ్డుపెట్టుకొని చంద్రబాబునాయుడు బతికాడని ఆయన చెప్పారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి  దళితుడుగా ఎవరైనా పుడతారా అని అంటారా అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు.