జగన్‌ది రాయలసీమ డిఎన్ఏ: చంద్రబాబు, లోకేష్‌లపై కొడాలి ఫైర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబునాయుడు, లోకేష్ లు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ది రాయలసీమ డిఎన్ఏ అని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. లోకేష్ డిఎన్ఏ ఏమిటో చెక్ చేసుకోవాలని ఆయన కోరారు. సీఎం జగన్ పై లోకేష్, చంద్రబాబులు చేస్తున్న విమర్శలపై నాని మండిపడ్డారు. శుక్రవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
లోకేష్ పాదయాత్రను జనం పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చెక్కిందని మాజీ మంత్రి కొడాలి నాని చెప్పారు. అందుకే జగన్ పై ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని నాని తెలిపారు. వైఎస్ జగన్ సీమ బిడ్డ కాబట్టే స్వంతంగా పార్టీ పెట్టి సీఎం అయ్యారన్నారు. తన డీఎన్‌ఏ ఏమిటో లోకేష్ చెక్ చేసుకోవాలని ఆయన కోరారు. జగన్ రాయలసీమలోనే పుట్టారని చెప్పారు. లోకేష్ తెలంగాణలో పుట్టారని ఆయన గుర్తు చేశారు.
రాయలసీమలోనే పుట్టావా అని లోకేష్ అడిగితే తప్పు లేదా అని ఆయన ప్రశ్నించారు. అదే తాము లోకేష్ నీవు ఎక్కడ పుట్టావని అడిగితే చంద్రబాబు, ఆయన కొడుకు పెద్దగా ఏడుస్తారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
కడప జిల్లాలో జగన్ పుట్టినందునే సోనియా గాంధీని వ్యతిరేకించి పార్టీని ఏర్పాటు చేశారని కొడాలి నాని చెప్పారు. తెలంగాణలో పుట్టి పెరిగిన లోకేష్ ఇవాళ ఏపీలో తిరుగుతూ జగన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన విమర్శించారు. తాను బూతులు మాట్లాడుతానని విమర్శించే వాళ్లకి చంద్రబాబు, లోకేష్ మాట్లాడే మాటలు కన్పించడం లేదా అని కొడాలి నాని వి ప్రశ్నించారు.
also read:విజయమ్మను ఓడించేందుకు వైఎస్ వివేకా యత్నించారు: కొడాలి నాని పంచలనం
చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసునని చెప్పారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలేనని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో వర్షాలు కురిశాయా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 13 ఏళ్లు రాష్ట్రంలో కరువు తాండవించిందన్నారు. చంద్రబాబు నిష్ట దరిద్రుడు అంటూ కొడాలి నాని మండిపడ్డారు. అవినీతి సొమ్మును చంద్రబాబునాయుడు హెరిటేజ్ సంస్థలో దాచాడని ఆయన విమర్శించారు. అవినీతితోనే రెండెకరాల నుండి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు చేరాడన్నారు. చంద్రబాబునాయుడు అవినీతి చక్రవర్తి అంటూ ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వారసులంతా సామాన్యులా బతుకుతుంటే చంద్రబాబునాయుడు మాత్రం కోట్లకు పడగలెత్తారన్నారు.