విశాఖపట్టణం: విశాఖపట్టణంలో భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ కు శుక్రవారం నాడు లేఖ రాశారు.

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విశాఖలో భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేశారు.  సిట్ విచారణ నివేదికపై చర్యలు తీసుకోవాలని  ఆనాడు విపక్షాలు డిమాండ్ చేశాయి.

విశాఖ భూ కుంభకోణం విషయంలో ఆనాడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా, ప్రత్యక్షంగా విపక్షాలతో పాటు స్వంత పార్టీకి చెందిన నేతలు కూడ విమర్శలు చేశారు. 

ఈ తరుణంలో విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎ: జగన్ కు లేఖ రాయడం ప్రాదాన్యత సంతరించుకొంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో విశాఖ భూ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని తానే కోరిన విషయాన్ని  గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 విశాఖ భూ కుంభకోణంపై దర్యాప్తు కావాలని వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు కోరుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు  సిట్ దర్యాప్తును కోరుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నట్టుగా ఆ లేఖలో గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖ భూ కుంభకోణంపై  సిట్ తో దర్యాప్తు చేయించాలని గంటా శ్రీనివాసరావు ఆ లేఖలో డిమాండ్ చేశారు.