Asianet News TeluguAsianet News Telugu

డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి?: ఆ రెండు సార్లు ఇలా, ఈ సారైనా..

కడప జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి భవితవ్యం ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది

former minister dl ravindra reddy likely to join in tdp
Author
Kadapa, First Published Nov 28, 2018, 12:56 PM IST


కడప:  కడప జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి భవితవ్యం ఏమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. ఈసారైనా డీఎల్ టీడీపీలో చేరుతారో లేదోననే చర్చ సాగుతోంది.

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. గతంలో కూడ డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం  సాగింది. కానీ, ఆయన టీడీపీలో చేరలేదు.

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రి మైసూరారెడ్డితో పాటు డీఎల్ రవీంద్రారెడ్డి కూడ టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. కానీ,కారణాలు ఏమిటో కానీ మైసూరారెడ్డి మాత్రమే టీడీపీలో చేరారు. డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మైసూరారెడ్డికి చంద్రబాబునాయుడు రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టారు.

ఆ తర్వాత పరిణామ క్రమంలో మైసూరారెడ్డి కూడ 2014 ఎన్నికల ముందు టీడీపీని వీడి  వైసీపీలో చేరారు. వైసీపీ నుండి కూడ ఆయన బయటకు వచ్చారు. 2014 ఎన్నికల ముందు పార్లమెంట్ లో రాష్ట్ర విభజన బిల్లును యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఆంధ్రప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఎక్కువగా టీడీపీ, వైసీపీలో చేరారు.  ఆ సమయంలోనే  డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. చంద్రబాబునాయుడును కూడ కలిశారు. కడప జిల్లాలోని మైదుకూరు టికెట్టు కావాలని రవీంద్రారెడ్డి కోరారు. అయితే ఆ సమయంలో మైదుకూరు అసెంబ్లీకి టీడీపీ ఇంచార్జీగా సుధాకర్ యాదవ్ ఉన్నారు. దీంతో కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని రవీంద్రారెడ్డిని చంద్రబాబునాయుడు కోరారు.

కానీ, సీట్ల సర్ధుబాటు కుదరకపోవడంతో డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరలేదు. దీంతో రెండోసారి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించి సైలెంటయ్యారు. ఎన్నికల తర్వాత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.

మైదుకూరు సీటు విషయంలోనే ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. దీంతోనే మైదుకూరు టీడీపీ ఇంచార్జీ సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు చంద్రబాబునాయుడు. మైదుకూరు నుండి డీఎల్ రవీంద్రారెడ్డికి లైన్ క్లియర్ చేసేందుకు  సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మెన్ పదవి ఇచ్చారని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

అయితే ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడ డీఎల్ రవీంద్రారెడ్డితో కూడ టచ్‌లోకి వెళ్లారని సమాచారం. దీంతో రవీంద్రారెడ్డి కొంత సైలెంటయ్యారు. ఏడాది క్రితం తన జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా అనుచరులతో సమావేశమైన డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయాల్లో ఇక చురుకుగా పాల్గొంటానని ప్రకటించారు.

ఆ తర్వాత మండలాల వారీగా కార్యకర్తల సమావేశాల్లో కూడ డీఎల్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.  కడప జిల్లాలో వైసీపీని దెబ్బతీసేందుకు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి నేతల కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దరిమిలా మరోసారి డీఎల్‌తో టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు.  టీడీపీలోకి చేరేందుకు డీఎల్ కూడ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

త్వరలోనే డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం కడప జిల్లాలోని టీడీపీ వర్గాల్లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సారైనా డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరుతారా లేదా  అనేది త్వరలోనే స్పష్టత రానుంది. ఈ దఫా కూడ  డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరకపోతే మూడు సార్లు  టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నించి వెనక్కు  తగ్గినట్టు అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios