నిన్న బెయిల్: నేడు రాజమండ్రి జైలు నుండి దేవినేని ఉమా విడుదల
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి గురువారం నాడు విడుదలయ్యారు. నిన్న ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రాజమండ్రి: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. దేవినేనికి ఏపీ హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన పత్రాలను జైలులో సమర్పించడంతో ఇవాళ ఉదయం ఆయనను జైలు నుండి విడుదల చేశారు.
మాజీ మంత్రి ఉమాపై ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద జి. కొండూరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి వస్తున్న దేవినేని ఉమాపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారని టీడీపీ ఆరోపిస్తోంది.ఈ విషయమై వారిని అరెస్ట్ చేయాలని మాజీమంత్రి దేవినేని ఉమా పోలీస్‌స్టేషన్ ముందే బైఠాయించారు.
also read:దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్: ఏపీ హైకోర్టు ఆదేశాలు
జి. కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు కూడ దేవినేని ఉమామహేశ్వరరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి గురైన దేవినేని అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అరెస్టైన దేవినేని ఉమా మహేశ్వరరావు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును కోరారు. ఈ కేసులో ఇంకా అరెస్టులు చేయాల్సి ఉంది, విచారణ సాగుతుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దాడికి గురైనవారినే పోలీసులు అరెస్ట్ చేశారని దేవినేని తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు బుధవారం నాడు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.