సారాంశం
మంత్రిగా ఉన్న సమయంలో డబ్బులు తీసుకున్నానని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.
ఒంగోలు: తాను మంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఫండ్ గా ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నట్టుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఆదివారంనాడు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు.కానీ, తాను ఎవరినీ కూడ బెదిరించి డబ్బులు వసూలు చేయలేదన్నారు. అప్పులు చేసి రాజకీయాలు చేస్తున్నానన్నారు. ఒంగోలులోనే తాను రూ. 15 కోట్లు అప్పులు చేసినట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. టీడీపీ వారి వద్దే తాను అప్పులు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
తమకు ఉన్న భూములను పేదలకు పంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయాన్ని తమ గ్రామానికి వెళ్లి అడిగితే ఎవరైనా చెబుతారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.తాను విద్యాభ్యాసం చేసే రోజుల్లో తన స్నేహితులు ఎవరైనా డబ్బులు అడిగితే ఇంట్లో గొడవ పెట్టుకొని తన స్నేహితుల కోసం డబ్బులు తీసుకెళ్లేవాడినని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడ గెలవని విషయాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. సెటిలర్లు బీఆర్ఎస్ కు ఓటేశారని ఆయన చెప్పారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ అదే పరిస్థితి నెలకొంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్‌సీపీ మరో దఫా విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
also read:నేను నీతిమంతుడిని కాదు: మాజీ మంత్రి బాలినేని సంచలనం
తాను నీతివంతుడిని కానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా డబ్బులిస్తే తీసుకొనేవాడినని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాను నీతివంతుడినని చెప్పుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండే పోటీ చేస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తాను పందెం కాశానని చెప్పారు. అయితే తన కొడుకు మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. తన కొడుకు కోసం తాను కాసిన పందెం వెనక్కు తీసుకున్నట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.
గత కొంతకాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను టిక్కెట్లు ఇప్పించిన వారే తనకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు చేసిన విషయంపై ఆయన గతంలో భావోద్వేగానికి గురయ్యారు. ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్ల అంశంపై గన్ మెన్లను సరెండర్ చేశారు.