Asianet News TeluguAsianet News Telugu

నేను నీతిమంతుడిని కాదు: మాజీ మంత్రి బాలినేని సంచలనం

మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం చర్చకు దారి తీశాయి.  తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నట్టుగా  ఆయన  చెప్పారు. 

 Iam not honest says Former Minister  Balineni Srinivas Reddy Sensational comments lns
Author
First Published Dec 10, 2023, 11:56 AM IST

ఒంగోలు: తాను నీతిమంతుడినని చెప్పడం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒంగోలులో శనివారం నాడు నిర్వహించిన  ఓ కార్యక్రమంలో  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి  ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా డబ్బులిస్తే  తాను తీసుకున్నట్టుగా  ఆయన  చెప్పారు.  తాను విచ్చలవిడిగా  డబ్బులు ఖర్చు చేస్తున్నానని కొందరు  అంటున్నారన్నారు. రూ. వెయ్యి కోట్లు సంపాదించానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  అప్పులు చేసి రాజకీయాలు చేస్తున్నట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. గత ఎన్నికల సమయంలో  తన ఎన్నికల ఖర్చంతా  తన వియ్యంకుడే పెట్టాడని  ఆయన చెప్పారు.  తాను మంత్రిగా ఉన్న సమయంలో  ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నానన్నారు. డబ్బులు తీసుకోలేదని నిజాయితీపరుడినని తాను చెప్పుకోవడం లేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.

30 ఏళ్లనుంచి రాజకీయాల్లో ఉన్నానని  బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని ఆయన  తెలిపారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఒంగోలు నుండే పోటీచేస్తానని స్పష్టం చేశారు. మరో నియోజకవర్గానికి వెళ్లబోనని ఆయన తేల్చి చెప్పారు.అందరూ కలిసి పని చేస్తానంటేనే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్‌కి చెప్పానని  బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

 తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ.50 లక్షలు పందెం కట్టినట్టుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.  తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగి తన కొడుకు బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడని ఆయన గుర్తు చేసుకున్నారు. 

 తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే ఏపీలో వైసీపీ వస్తుందని తన కొడుకు తపన పడ్డారని చెప్పారు.తన కొడుకు బాధపడకూడదని పెట్టిన పందెం రద్దుచేసుకున్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో  బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పించారు.

also read:ఫేక్ డాక్యుమెంట్స్ స్కాంపై బాలినేని ఫిర్యాదు:సీఎంఓ సెక్రటరీతో ఒంగోలు కలెక్టర్, ఎస్పీల భేటీ

ఇదే జిల్లా నుండి ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తొలుత మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో  బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుండి తప్పించారు.  కానీ,ఆదిమూలపు సురేష్ ను కొనసాగించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వైఎస్ఆర్‌సీపీ  కోఆర్డినేటర్ గా నియమించారు. అయితే ఈ పదవికి కూడ  బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై  బాలినేని శ్రీనివాస్ రెడ్డి  అసంతృప్తిగా ఉండి రాజీనామా చేసినట్టుగా అప్పట్లో ప్రచారం సాగింది.

ఈ విషయమై  సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. మరో వైపు  ఫేక్ డాక్యుమెంట్ల అంశంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన గన్ మెన్లను కూడ సరెండర్ చేసిన విషయం తెలిసిందే. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా  వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే  బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాను టిక్కెట్లు ఇప్పించిన వారు తనపై ఫిర్యాదులు చేస్తున్నారని  గతంలో  మీడియా వేదికగా  బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై  మీడియా సమావేశంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios