విశాఖపట్టణం: మాజీ మంత్రి, జనసేన నేత పసుపులేటి బాలరాజు వైఎస్ఆర్‌సీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తన సన్నిహితులు, కార్యకర్తలతో బాలరాజు సమావేశమయ్యారు. పార్టీ మారే విషయమై కాలమే నిర్ణయిస్తోందని బాలరాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి బాలరాజు వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి  సీఎం జగన్ కూడ సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం.  అనారోగ్యం వల్ల మూడు మాసాలుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం నాడు ఆయన చింతపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు.  పార్టీ నేతలతో సుధీర్ఘంగా చర్చించారు. పార్టీ మారే విషయమై బాలరాజు పరోక్షంగా తన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.

ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్ అమల్లోకి తీసుకొచ్చారని బాలరాజు సీఎంను పొగిడారు. మధ్యనిషేధం విధింపు మంచి నిర్ణయమని ఆయన బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు.

ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు అందినప్పుడే ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందని ఆయన చెప్పారు.వలంటీర్ల ఎంపికలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మండల స్థాయి అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.