అమరావతి:  టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి చోటు చేసుకొందని ఏపీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ నివేదిక తేల్చింది. ఈ విషయమై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో అచ్చెన్నాయుడును శుక్రవారం నాడు ఉదయం అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు ఈ కుంభకోణం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

also read:ఈఎస్ఐ స్కామ్: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్టు

ఏపీ రాష్ట్రంలో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో అచ్చెన్నాయుడికి చోటు దక్కింది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు నిర్వహించారు.

కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్న కాలంలో ఈఎస్ఐ కుంభకోణం చోటు చేసుకొందని ఏసీబీ అధికారులు గుర్తించారు. అవసరం లేకున్నా శస్త్రచికిత్స పరికరాలు కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈఎస్ఐ డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందులు కొనుగోలు చేశారు. అయితే ఇందులో రూ. 100 కోట్లు నకిలీ బిల్లులను సృష్టించారని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్  కేటాయిస్తే రూ. 698 కోట్లు మందులు కొనుగోలు చేశారు. 

మందుల కొనుగోలులో ప్రభుత్వ ఖజానాకు రూ. 400 కోట్లకు పైగా నష్టం కల్గించారని కూడ ఈ నివేదిక తేల్చింది. నకిలీ బిల్లుల ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని ఈ నివేదిక అభిప్రాయపడింది. 2018-19 లో రూ. 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్టుగా రికార్డులో ఉంది. అయితే దీనిలో సుమారు రూ. 10 కోట్లకు పైగా నిధులను స్వాహా చేశారని నివేదిక తేల్చింది.

బయోమెట్రిక్ మిషన్ కు రూ. 16 వేలు అయితే ఏకంగా దాన్ని రూ. 70 వేలకు కొనుగోలు చేశారని చెప్పారు. దీని కోసం నకిలీ ఇండెంట్లు కూడ సృష్టించారని నివేదిక తెలుపుతోంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు.

రూ.89 కోట్ల ప్రభుత్వ చెల్లింపుల్లో రేటు కాంట్రాక్టు సంస్థలకు రూ. 38 కోట్లు మాత్రమే చెల్లించారని తేల్చింది. మిగిలిన రూ. 51 కోట్లను దారి మళ్లించినట్టుగా ఈ నివేదిక అభిప్రాయపడింది. రేట్ కాంట్రాక్టు లేని సంస్థలకు పరికరాల కొనుగోలుకు వాస్తవ ధర కంటే 132 శాతం అధిక ధరలకు విక్రయించారని విజిలెన్స్ రిపోర్టు తేల్చింది. మొత్తంగా ఈ వ్యవహరంలో సుమారు. 150 కోట్ల అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏసీబీ గుర్తించింది. ఈ కేసులోనే ఇవాళ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసింది ఏసీబీ.

అవసరం లేకున్నా శస్త్రచికిత్స పరికరాలను కొనుగోలు చేసినట్టుగా ఈ రికార్డులు తేల్చి చెప్పాయి. ఈ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై కూడ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను అప్పట్లోనే ఇద్దరు మాజీ మంత్రులు ఖండించారు. 

టీడీపీ ప్రభుత్వ హయంలో ఈఎస్ఐ డైరెక్టర్లుగా ఉన్న రవికుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్ లు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టుల పాత్ర ఉందని విజిలెన్స్ నివేదిక తేల్చింది.

టెలీ హెల్త్ సర్వీసెస్ కాంట్రాక్టు ఇవ్వాలని అచ్చెన్నాయుడు లేఖ రాసినట్టుగా ప్రభుత్వం అప్పట్లోనే అరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే తాను ఈ లేఖ రాసినట్టుగా ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. తప్పు చేయలేదని  ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి  స్పష్టం చేశారు. తప్పు చేసినట్టుగా నిరూపిస్తే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.

విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా విచారణ చేయాలని ఏసీబీని ఆదేశించింది ప్రభుత్వం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. విజిలెన్స్ నివేదిక తేల్చిన అంశాలతో సరిపోల్చుకొన్నారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు అప్పట్లో పనిచేసిన అధికారులను కూడ ఇవాళ అరెస్ట్ చేశారు.

 తెలంగాణలో కూడ ఇదే తరహాలో స్కామ్ చోటు చేసుకొంది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణిని తెలంగాణలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవికారాణితో పాటు పలువురు అధికారులు, ఫార్మసిస్టులు, కొన్ని ఫార్మా సంస్థల యజమానులను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.