అమరావతి: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వచ్చే వారంలో  వైసీపీలో చేరే అవకాశం  ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే  నెల్లూరులోని ఏ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలనే అనే అంశంపై ఆనం రామనారాయణరెడ్డి  ఇంకా స్పష్టత రాలేదు.  నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని ఆయన యోచిస్తున్నారు. అయితే వచ్చే వారం ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

టీడీపీ నాయకత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరాలని  భావిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.ఈ లోపుగానే  ఆనం వివేకానందరెడ్డి మరణించడంతో రామనారాయణరెడ్డి టీడీపీని వీడడం కొంత ఆలస్యమైంది.

ఆనం రామనారాయణ రెడ్డి  టీడీపీని వీడకుండా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మంత్రులు చేసిన ప్రయత్నాలు కొంత ఫలవంతమైనట్టుగా కన్పించినప్పటికీ చివరికి ఆయన పార్టీ మారేందుకు మొగ్గు చూపారు.

టీడీపీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదనే కారణంగా ఆయన వైసీపీలో చేరాలని భావిస్తున్నారు.  గత నెలలో  వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఆనం రామనారాయణరెడ్డితో చర్చలు జరిపారని సమాచారం. 

ఆ తర్వాత కూడ కొందరు వైసీపీ నేతలు ఆయనత్‌ టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం కూడ సాగుతోంది.  ఈ తరుణంలో ఆనం రామనారాయణరెడ్డి తన అనుచరులతో సంప్రదింపులు జరిపి టీడీపీని వీడుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. 

అయితే వైసీపీలో చేరితే ఏ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాాలనే విషయమై ఆయన  అనుచరులతో చర్చిస్తున్నారు. జిల్లాలోని ఉదయగిరి, వెంకటగిరి,  ఆత్మకూర్, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేయాలని  ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నారు. అయితే ఏ స్థానం నుండి పోటీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ నాయకత్వం ఆనం రామనారాయణరెడ్డికి ఏ స్థానం నుండి టిక్కెట్టు ఇస్తోందోననే విషయమై కూడ ఇంకా స్పస్టత రావాల్సి ఉంది.

అయితే వైసీపీలో  ఎప్పుడు చేరాలనే దానిపై  ఆనం రామనారాయణరెడ్డి వచ్చే వారంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.  అయితే వైసీపీలో  చేరే సమయంలో తన బలాన్ని నిరూపించుకోవాలని ఆనం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.