రాజకీయాల్లోకి రానున్న మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్..! వైసీపీ నుంచి పోటీ..!!
తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన ఓ మాజీ ఐఏఎస్ అధికారి రాజకీయాల్లోకి రానున్నారు. వైసిపి, టిడిపి ప్రభుత్వాల్లో కీలక శాఖలకు పనిచేసిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అమరావతి : మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. వైసిపి, టిడిపి ప్రభుత్వాల్లో కీలక శాఖల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయకుమార్. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వ పాలనను ప్రశంసిస్తూ హాట్ టాపిక్ గా మారారు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ ను ‘దేవుని బిడ్డ’ అని కూడా సంబోధించి తీవ్ర చర్చకు కారణమయ్యారు. అయితే ఇవన్నీ రాజకీయాల్లోకి రావడం కోసమే అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.
విజయ్ కుమార్ కు రాజకీయాల్లోకి రావాలనేది చిరకాల కోరికట. ఐఏఎస్ విజయ్ కుమార్ కలెక్టర్ గా పనిచేశారు. పలు కీలక శాఖలకు సెక్రటరీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చూస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ కుమార్ రిటైర్ అయ్యారు. అయితే ఆయనకి ప్రణాళిక శాఖలో జగన్ కీలక పదవి ఇచ్చి, ప్రభుత్వంలో కొనసాగించారు. కొత్త జిల్లాల ఏర్పాటు, విద్యా శాఖలో మార్పులు, వాలంటీర్ వ్యవస్థ లాంటి పలు శాఖల్లో విజయ్ కుమార్ సమర్థంగా తన పాత్ర పోషించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంతింటి నిర్మాణానికి లైన్ క్లియర్.. ఎక్కడ కడుతున్నారంటే ?
ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. మొన్నటి వరకు విజయకుమార్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సెక్రటరీగా ఉన్నారు. శనివారం నాడు ఆయన తన పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను సిఎస్ జవహర్ రెడ్డికి సమర్పించారు. ఆయన రాజీనామాను జవహర్ రెడ్డి వెంటనే ఆమోదించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. విజయ్ కుమార్ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలతో ఏం గిరిజా శంకరను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వైసీపీలో చేరి జగన్ వెంట ఉండాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ మరోసారి సీఎంగా చూడాలని.. దళిత, బీసీ, గిరిజన, మైనారిటీ వర్గాలను కూడగట్టేందుకు విజయకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంట్లో భాగంగానే.. ఇప్పటివరకు తాను పనిచేసిన ఒంగోలు, విజయవాడ, నెల్లూరుల్లో దళిత,గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఆదివారము నుంచి ‘ఐక్యత విజయ పథం’ అనే పేరుతో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు.
తడ నుంచి తుని వరకు ఉండే ఈ యాత్రకు సంబంధించి పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లు, ప్రకటన వైసీపీలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇదంతా పదవి నుంచి అతను రిలీవ్ కాకముందే ప్లాన్ చేసి ప్రకటన, పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తరువాతే శనివారం నాడు రాజీనామా చేయడం, ఆమోదం రావడం జరిగింది. ఇంకా పదవి నుంచి రిలీవ్ కాకుండానే..ఇలా చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారట అంటే…
వైసిపి ప్రభుత్వంలో జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న ఐఏఎస్ విజయ్ కుమార్.. మరోసారి జగన్ ని అధికారంలోకి వచ్చేలా చేయాలన్నా సంకల్పంతోటే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి మద్దతుగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక రానున్న ఎన్నికల్లో విజయ్ కుమార్ తిరుపతి లేదా బాపట్ల.. ఏదో ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం తిరుపతి ఎంపీగా గురుమూర్తి, బాపట్ల ఎంపీగా నందిగామ సురేష్ లు ఉన్నారు. ఎక్కడి నుంచి విజయ్ ను పోటీ చేయించినా అక్కడ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారుతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఇద్దరు నందిగామ సురేష్, గురుమూర్తిలను జగన్ ఏరి కోరి పార్టీలోకి తెచ్చుకున్నారు. ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్న సంగతి తెలిసిందే.
దీంతో విజయకుమార్ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక స్థానం కావాలని అడుగుతుండడంతో.. ఇప్పుడు ఎవర్ని స్థానభ్రంశం చేస్తారు.. ఇంకెక్కడి నుంచి పోటీ చేపిస్తారు.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక విజయ్ కుమారే కాకుండా మరో ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు కూడా కూడా రాజకీయాల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. దీని మీద పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు అందరినీ పార్టీలోకి ఆహ్వానించుకుంటూ వెడితే.. అసలుకే ఎసరొచ్చే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. ఇక, విజయ్ కుమార్ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది అభ్యర్థుల ప్రకటన వస్తే కానీ తెలియరాదు.