అమరావతి: అమరావతి బాండ్లు కొన్న తొమ్మిది మంది పేర్లను బయటపెట్టాలని  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  డిమాండ్ చేశారు. అమరావతిని అభివృద్ది చేసే పేరుతో అధిక వడ్డీకి నిధులు తీసుకోవాల్సిన అవసరం ఏముందని  ఆయన ప్రశ్నించారు. 

సోమవారం నాడు   ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిని అభివృద్ది  చేసేందుకు అధిక వడ్డీకి ఎందుకు అప్పులు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. బాండ్ల ద్వారా 2 వేల కోట్ల రూపాయాలను సమీకరిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే ఈ  రెండు వేల కోట్లకు  ప్రతి మూడు మాసాలకు ఓసారి  10.36 శాతం వడ్డీని  చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి బాండ్ల సేకరణ విషయమై  బ్రోకర్ కు రూ. 17 కోట్లు ఇవ్వడమే బాబు మార్క్ పారదర్శకతా అని ఆయన ప్రశ్నించారు. 

అమరావతి బాండ్లను కొనుగోలు చేసిన తొమ్మిది మంది పేర్లను బయటపెట్టాలని  ఆయన డిమాండ్ చేశారు. పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని చెబుతున్న చంద్రబాబునాయుడు ఈ పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.