విజయవాడ: కృష్ణా జిల్లాలో ఏకగ్రీవ పంచాయితీలపై ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమీషన్  స్పందించింది. ఇవాళ(సోమవారం) సాయంత్రానికి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ కార్యదర్శి కె.కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఎస్ఈసీ ఆదేశాలతో జిల్లాలో నామినేషన్ల సందర్భంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్న జిల్లా కలెక్టర్. దీంతో ఈ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా పంచాయితీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన చేసే అవకాశం వుందని తెలుస్తోంది. 

read more   మంత్రి పెద్దిరెడ్డి ఇష్యూ: గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ

ఇప్పటికే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. అంతేకాదు ఈ జిల్లాల్లోని ఏకగ్రీవ పంచాయితీల వివరాలను ప్రకటించొద్దని కూడ ఎస్ఈసీ సూచించింది.

గ్రామపంచాయితీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకొన్న గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో చిత్తూరులో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి.

అయితే ఈ ఏకగ్రీవ ఎన్నికల విషయంలో అధికార పార్టీ తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ తన అధికారాన్ని ఉపయోగించుకొని బలవంతంగా ఏకగ్రీవాలకు పాల్పడుతోందని టీడీపీ, బీజేపీలు ఆరోపించాయి.

సాధారణ ఏకగ్రీవాలపై ఇబ్బందులు లేవని... అసాధారణ ఏకగ్రీవాలపై కేంద్రీకరిస్తామని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసాధారణ ఏకగ్రీవాలు జరిగితే అధికారుల వైఫల్యమేనని కూడ ఆయన తెలిపారు.  ఇందులో భాగంగానే తొలివిడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయితీలపై ఎస్ఈసీ కేంద్రీకరించింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టుగా ఎస్ఈసీ గుర్తించింది.

 ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా ఏకగ్రీవ ఎన్నికలు జరగడంపై ఎస్ఈసీ ఆరా తీసింది. ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తి చేసిన గ్రామాలకు సంబంధించి సమగ్ర నివేదికను ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని కూడ ఎస్ఈసీ శుక్రవారం నాడు  ప్రకటించింది.