విజయవాడ: ఇద్దరి వయస్ససు 15 ఏళ్లు. 13 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆలోచనతో ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని రైలెక్కాశారు. సినిమాను తలపిస్తున్న ఈ ప్రేమకథ ఎక్కడ జరిగిందనుకుంటున్నారా......ప్రేమికులు వేరే రాష్ట్రానికి చెందిన వారైనా పెళ్లి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లో. 

పశ్చిమ బంగ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులు ఒక ప్రైవేట్ పాఠశాలలో  చదువుకుంటున్నారు. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. అయితే సినిమాల ప్రభావమో ఏమో తెలీదు కానీ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించరని భావించిన బాల్యప్రేమికులు ఇంట్లోంచి డబ్బులు తీసుకుని చెన్నై వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే చెన్నై వెళ్లే ట్రైన్ ఎక్కేశారు. మధ్యలో పెళ్లి చేసుకోవాలని అనిపించడంతో ఒంగోలులో దిగి ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. 

ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తమ విషయం చెప్దామంటే తెలుగు కూడా రాదు. అయినా అధైర్యపడలేదు. ఒంగోలు సముద్రతీరంలో ఓ పాకలో పదిరోజులుగా జీవిస్తున్నారు. వీరిని గమనించిన స్థానికులు ఇంటికి వెళ్లిపోమని సలహా ఇచ్చారు. డబ్బులు ఇచ్చి రైలెక్కించారు. రైలులో కోల్ కతా వెళ్తున్న వీరిని చైల్డ్ లైన్ సిబ్బంది విజయవాడ రైల్వే స్టేషన్లో గుర్తించి తమ సంరక్షణలో తీసుకున్నారు. 

వివరాలు అడిగితే వారు చెప్పిన ప్రేమ  కథకు చైల్డ్ లైన్ సిబ్బంది నోరెళ్ల బెట్టారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ఇద్దరినీ హాజరుపరిచారు. పూర్తి వివరాలు సేకరించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.