శ్రీవారి దర్శనం క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు.. టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉండే భక్తులకోసం మరో సదుపాయాన్ని టీటీడీ తీసుకురానుంది. గంటలకొద్దీ వేచి ఉండే భక్తులు నీరసించి పోకుండా.. వారికి క్యూలైన్లోనే పాలు, ఆహారం అందించే ఏర్పాట్లు చేయనుంది.
తిరుమల : శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ YV Subbareddy అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్లాట్ సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. క్యూలో దర్శనానికి వెళుతున్న భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్ల నిర్వహణ పరిశీలించారు. సర్వదర్శనం ఎంత సమయంలో అవుతోందని అధికారులను అడిగారు. ఉదయం అయితే గంటన్నర లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వారికి రెండు గంటల్లో అవుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజిఓ బాలిరెడ్డి ని చైర్మన్ ఆదేశించారు.
మార్చి 28న అలిపిరిలో మెట్లోత్సవం
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 519వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 28వ తేదీ టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ''సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం'' నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ నడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. టిటిడి అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్లకళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా మార్చి 29 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన, నిత్యార్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.
అదేవిధంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 7.45 గంటల వరకు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జితసేవలైన ఊంజల్ సేవను టిటిడి రద్దు చేసింది.
టీటీడీకి రూ కోటి విరాళం
ఓ దుబాయ్ భక్తుడు టీటీడీ కి రూ కోటి విరాళాన్ని చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి డిడి అందజేశారు. దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ ఎం. హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీకి రూ కోటి విరాళంగా అందించారు. తిరుమల లోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఈ మేరకు డిడి అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు.
గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం
టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ కు సికింద్రాబాద్ కు చెందిన శ్రీ పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీ శ్రీధర్ శుక్రవారం రూ.10, 01, 116 ( పదిలక్షల వెయ్యి నూట పదహారు) విరాళంగా అందించారు. తిరుమల లోని టీటీడీ చైర్మన్ క్యాపు కార్యాలయంలో ఈ మేరకు డిడిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు. చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.