నాగావళి నది ఉధృతి: కుప్పకూలిన జింగిడిపేట వంతెన

First Published 21, Jul 2018, 3:35 PM IST
Floods in Odisha and Ap border: Bridge collapses in Nagavali river
Highlights

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో  నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాలకు  పెద్ద ఎత్తున  వరద నీరు వచ్చి చేరడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే  జింగిడిపేట బ్రిడ్జి కుప్పకూలిపోయింది.


విజయనగరం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో  నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాలకు  పెద్ద ఎత్తున  వరద నీరు వచ్చి చేరడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే  జింగిడిపేట బ్రిడ్జి కుప్పకూలిపోయింది.

ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏజేన్సీ ప్రాంతాలకు రాకపోకలు సాగించే జింగిడిపేట బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొంది. దీనిపై  వాహనాల రాకపోకలను నిషేధించారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి, నాగావళి నదులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నాగావళిలోనే కళ్యాణి నది కలవడంతో  వరద ప్రవాహం మరింత పెరిగింది.

దీంతో  ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.  జింగిడిపేట వద్ద నాగావళి వరద ఉధృతికి  బ్రిడ్జి ఒకవైపుకు ఒరిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్రిడ్జి కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ బ్రిడ్జి కుప్పకూలడంతో ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు సాగించడం కష్టం.  ఒడిశాకు చెందిన అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రికి తోటపల్లి రిజర్వాయర్ ‌కు కూడ భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 
 

loader